హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ హెచ్చరిక చేసింది. మరో గంటలో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అధికారులు రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేశారు. కాగా.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి.
ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న మూడ్రోజులు గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని మహబూబ్ నగర్లోకి ప్రవేశించిన రుతుపవనాలు.. మంగళవారం మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది.