పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ.. రెండు లక్షల మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేసింది. పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధలు పాల్గొన్నారు. డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ బోరబండ, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో మట్టి వినాయకుల పంపిణీ చేపట్టారు.
ఇందిరా పార్కు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మహిళా కార్పొరేటర్లతో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీమతి శ్రీదేవి కూడా పాల్గొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థల నుంచి మట్టి వినాయక విగ్రహాలను జీహెచ్ఎంసీ సేకరించింది.
పర్యావరణ పరిరక్షణతో పాటు చెరువులు కలుషితం కాకుండా ఉండేందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వీటిని తయారు చేశారు. ప్లాస్టిక్ వంటి కృత్రిమ పదార్థాలతో చేసిన వాటిని కాకుండా సహజసిద్ధమైన మట్టితో తయారుచేసిన వినాయకులను పూజించాలని రామ్మోహన్ గత నెలరోజులుగా విస్తృత చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా 25 నిమజ్జన కొలనులను కూడా జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది.