మహానగర తీర్పు వచ్చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఫలితాలు కూడా అత్యంత అసక్తికరంగా వచ్చాయి. అధికార టీఆర్ఎస్ చిక్కుల్లో పడింది. అతిపెద్ద పార్టీగా అవతరించినా బల్దియా పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే ఎంఐఎం సాయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బీజేపీ అనూహ్యంగా పుంజుకుని హాఫ్ సెంచరీ వార్డులను కొల్లగొట్టింది. 2018 ఎన్నికల్లో కేవలం 4 వార్డులు గెల్చుకున్న బీజేపీ ఈసారి అంతకు పది రెట్లకుపైగా వార్డులను గెల్చుకోవడం గమనార్హం.
జీహెచ్ఎంసీలోని మొత్తం 150 వార్డులో ఎన్నికలు జరగ్గా చివరి ఫలితాలు అందే సమయానికి టీఆర్ఎస్కు దాదాపు 55 స్థానాలు దక్కాయి. కాషాయ దళానికి 51, ఎంఐఎంకు 42 వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 వార్డులే దక్కాయి. ఎంఐఎం రెండు స్థానాలు మినహా తన స్థానాలన్నింటిని తిరిగి నిలబెట్టుకుంది.
టీఆర్ఎస్ కూకట్పల్లి జోన్లో 17, షేరిలింగంపల్లిలో 13, సికింద్రాబాద్‌లో 7, ఎల్బీనగర్లో 5, ఖైరతాబాద్‌లో 4 వార్డులు కైవసం చేసుకుంది.
బీజేపీ ఎల్బీ నగర్లో 14, సికింద్రాబాద్‌లో 9, ఖైరతాబాద్‌లో 5, చార్మినార్‌లో 2 వార్డులు గెలుచుకుంది. ఒవైసీల పార్టీ చార్మినార్ జోన్లో 26 వార్డులు, ఖైరతాబాద్ జోన్లో 13 వార్డులు దక్కించుకుంది. సికింద్రాబాద్, షేరిలింగంపల్లిల్లోనూ మజ్లిస్ పార్టీకి ఒక్కో వార్డు దక్కింది.
ఫలితాలు గులాబీ పార్టీకి తీవ్ర నిరాశ కలిగించాయి. మేయర్ పదవి కోసం మజ్లిస్ మద్దతు తీసుకోవడం అనివార్యంగా మారింది. మిత్రపక్షమైన మజ్లిస్‌కు తన ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుంది కనుక దానితో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒవైసీలు చెప్పినట్లు నడుచుకోక తప్పని పరిస్థితి ఉంటుంది.
గత ఎన్నికల్లో 99 వార్డులు గెల్చుకున్న టీఆర్ఎస్ ఈసారి 60కే పరిమితం కావడంపై పార్టీలో అంతర్మథనం సాగుతోంది. ఎక్కడ పొరపాటు జరిగిందని నేతలు పోస్ట్ మార్టం చేస్తున్నాయి. కరోనా ప్రభావం, హైదరాబాద్ వరదలు, తగ్గిన పోలింగ్ వంటి అంశాలు ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు.
ఫలితాలు బీజేపీకి సంతృప్తి కలిగించాయి. హిందుత్వ సెంటిమెంట్లతో విపరీత ప్రచారం, టీఆర్ఎస్పై ఓటర్లలో నిరసన ఆ పార్టీకి వార్డులను సాధించిపెట్టింది.