75 ఫ్రీడం పార్కులు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ.. 10న ప్రారంభం
హైదరాబాద్ నగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో 75 ఖాళీ స్థలాలను ఫ్రీడం పార్కులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు స్థలాలను గుర్తించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జీహెచ్ఎంసీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఈ ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఈనెల 10వ తేదీన ఎంపిక చేసిన 75 ప్రాంతాల్లో 70,750 మొక్కలు నాటాలని కూడా నిర్ణయించింది. మొక్కలు నాటడంతో అదే రోజు ఫ్రీడం పార్కులు ప్రారంభమవుతాయి. పార్కుల్లో బెంచీలు, నడక మార్గాలు, ప్రవేశ ద్వారాలతో పాటు స్వాతంత్య్రాన్ని వివరించే పనులు చేపడుతున్నారు. అంతేకాక, పార్కులోని బెంచీలు, చెట్లు, గోడలు, ఇతర కాంక్రీట్ నిర్మాణాలకు త్రివర్ణ రంగులు వేయడంతో పాటు కొన్ని పార్కల్లో 75 రకాల చెట్లను పెంచనున్నారు. యువత కోసం త్రివర్ణ పతాకంలో సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలు, ప్రజాప్రతినిధులు, ఆయా కాలనీల సంక్షేమ సంఘాలను భాగస్వామ్యం చేస్తామని వివరించారు.