ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ ఫైన్.. బీజేపీ రూ.20 లక్షలు.. టీఆర్ఎస్‌కు... - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ ఫైన్.. బీజేపీ రూ.20 లక్షలు.. టీఆర్ఎస్‌కు…

July 3, 2022

హైదరాబాద్‌లో టీఆర్ఎస్-బీజేపీల మధ్య రాజకీయం కాక రేపుతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో బీజేపీ, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు మద్దతు తెలుపుతూ టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నగరం మొత్తాన్ని ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేశారు. నగరంలో అన్ని బస్టాప్‌లు, మెట్రో పిల్లర్లు, భారీ హోర్డింగులన్నీ రెండు పార్టీల ఫ్లెక్సీలతో నిండిపోయాయి. ఈ క్రమంలోనే రెండు పార్టీల నేతలు నిబంధనలు అతిక్రమించి మరీ కటౌట్లు, హోర్డింగులు ఏర్పాటు చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(GHMC) అధికారులు కొరడా ఝళిపించారు.

నగరవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను గమనించిన జీహెచ్‌ఎంసీకి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) డైరెక్టరేట్‌ అధికారులు రెండు పార్టీల నేతలకు జరిమానా విధించారు. శనివారం సాయంత్రం వరకూ బీజేపీ నేతలకు రూ.20 లక్షలు, టీఆర్ఎస్‌ నాయకులకు రూ.3 లక్షల మేర జరిమానాలు విధించినట్లు తెలిపారు. మొత్తానికి రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న రాజకీయ యుద్ధం నగరంలో వేడి పుట్టిస్తోందనడంతో సందేహం లేదు.