ఎలక్ట్రిక్ వాహనదారులకు జీహెచ్ఎంసీ గుడ్‌న్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎలక్ట్రిక్ వాహనదారులకు జీహెచ్ఎంసీ గుడ్‌న్యూస్

June 21, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఎలక్ట్రిక్ వాహనదారులకు జీహెచ్ఎంసీ అధికారులు ఓ శుభవార్తను చెప్పారు. విద్యుత్ వాహనాలను ప్రోత్సాహించేలా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హైదరాబాద్ వ్యాప్తంగా వందశాతం ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జూన్ 22న జరిగనున్న స్థాయీ సంఘం సమావేశంలో తీర్మానం కోసం ప్రవేశపెట్టనున్నామని, ఆమోదం పొందితే వెంటనే ఆదేశాలు జారీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

ఇంజినీర్లు మాట్లాడుతూ..”మొదటి దశలో 14 కేంద్రాలు నిర్మాణం కానున్నాయి. అందుకు బల్దియా ఎలక్ట్రిక్ విభాగం ఇంజినీర్లు ప్రతిపాదన రూపొందించారు. 20 మెట్రో రైలు స్టేషన్లలో విద్యుత్తు కార్లు, ద్విచక్ర వాహనాల కోసం ఇప్పటికే మెట్రో రైలు స్టేషన్ల వద్ద వేర్వేరు సంస్థలు 20 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. కొన్ని చోట్ల సేవలు నిలిచిపోయినప్పటికీ, మెజార్టీ ఛార్జింగ్ పాయింట్లు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్తు వాహనాల సంఖ్య పెరుగుతోంది. కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు, ఛార్జింగ్ విషయంలో అసౌకర్యం కలుగకుండా ఉండేలా జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి టీఎస్ రెడ్కో సాంకేతిక సహకారం అందించనుంది. కిలోవాట్‌కు రూపాయి చొప్పున రుసుము వసూలు చేస్తాం. ఆ డబ్బును ప్రతి మూడు నెలలకోసారి టీఎస్ రెడ్కో జీహెచ్ఎంసీకి అందజేస్తుంది” అని తెలిపారు.

ప్రస్తుతం కార్లకు సంబంధించి.. కూకట్‌పల్లి, ఎస్వీఆర్, ఉప్పల్ స్టేడియం, మెట్టుగూడ, తార్నాక, బేగంపేట, కేపీహెబీ, మూసాపేట, మియాపూర్, బాలానగర్ ఏరియాలలో ఛార్జింగ్ కేంద్రాలు ఉన్నాయి. త్వరలోనే కార్లకు ఉపయోగపడేలా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని అధికారులు వెల్లడించారు.

ఇక, ద్విచక్ర వాహనాలు, ఆటోల విషయానికొస్తే.. దిల్‌సుఖ్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఈస్ట్, కూకట్ పల్లి, నాగోల్, ఎస్జీటర్లు, హబ్సిగూడ, తార్నాక, పరేడ్ గ్రౌండ్, రసూలపుర, జేఎన్‌టీయూ కాలేజ్, మియాపూర్, పంజాగుట్టలో ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎంజీబీఎస్, అమీర్‌పేట, ఇందిరా పార్క్ కేబీఆర్ పార్క్ ఒకటో గేటు, మూడో గేటు, ఆరో గేటు, ట్యాంక్ బండ్, బషీర్ బాగ్ రోడ్డు, గన్ ఫౌండ్రీ మున్సిపల్ పార్కింగ్ కాంప్లెక్సు, ఆబిడ్స్, నానకిరామ్ గూడ, మహవీర్ హరిణి వనస్థలి జాతీయ ఉద్యానవనంలో కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ఇంజినీర్లు వివరాలను వెల్లడించారు.