ఊరంతా పండగ.. బల్దియాకు ఎండగ - MicTv.in - Telugu News
mictv telugu

ఊరంతా పండగ.. బల్దియాకు ఎండగ

November 28, 2017

హైదరాబాద్ నగరానికి మరింత వన్నె తేబోతున్న మెట్రో రైలు కొన్ని గంటల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. వేల కోట్లు ఖర్చుపెట్టి, ఎన్నో అడ్డంకులను అధిగమించిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జీహెచ్ఎంసీ పాత్ర కీలకమైనది. స్థల సేకరణతోపాటు, నిర్మాణానికి అడ్డుంకులు రాకుండా ఎన్నో చర్యలు తీసుకుంది. జీహెచ్ఎంసీ కార్మికులు మెట్రో కోసం అహర్నిశలు పనిచేశారు.

డ్రైనేజ్ పైపులైన్ల మార్పు, వ్యర్థాల తొలగింపు వంటి ఎన్నో పనులతో మార్గం సుగమం చేశారు. మెట్రోతోపాటు, ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు(జీఈఎస్) కోసం బల్దియా వందల కోర్టు ఖర్చుపెట్టి, ఖరీదైన స్థలాలను కూడా కట్టబెడుతున్నారు.   

అయితే, ఇంత చేసినా మెట్రో ప్రారంభ వేడుకల్లో బల్దియాను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రొటోకాల్‌ను చెత్తకుండీలో తుంగలో తొక్కి అవమానిస్తున్నారు.  ఈ సంబరాల్లో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దనరెడ్డిలకు చోటు లేకుండా పోయింది. మెట్రో రైలు ఫైలాన్‌లో, ఎల్‌ అండ్‌ టీ మెట్రో లిమిటెట్‌ వేసిన  వోచర్‌లోనూ జీహెచ్‌ఎంసీ ప్రాధాన్యం లభించలేదు.

మెట్రో శిలాఫలకంపైనా మేయర్ పేరు గల్లంతైంది. తొలి సర్వేసులో ప్రయాణించే వారి జాబితాలో కమిషనర్ పేరుకు చోటు దక్కలేదు. ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న మెట్రో ప్రారంభ వేడుకలో నగర ప్రథమ పౌరుడికి, బల్దియా కమిషనర్‌కు కనీస గౌరవం దక్కకపోవడంతో బల్దియా తీవ్ర అంసతృప్తితో ఉంది. మెట్రో ప్రారంభం కానున్న మియాపూర్ లో ఆ వేడుకకు స్థానిక కార్పొరేటర్‌ను కూడా ఆహ్వానించకపోవడం ఘోరమంటున్నారు.

 సొంత పార్టీ ప్రజా ప్రతినిధులకు విలువలేదా!                 

తెలంగాణ రాష్ట్రం వచ్చాక నగరానికి తొలి మేయర్ బొంతు రామ్మోహన్. ఎన్నడూలేనంత మెజారిటీతో బల్దియాను చేజిక్కించుకుంది టీఆర్ఎస్. అయితే మేయర్‌కు ఎక్కడ ప్రోటోకాల్ ప్రకారం కల్పించాల్సిన గౌరవమర్యాదలు కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నగరానికి ఏ ప్రముఖ అతిథి వచ్చినా ఆహ్వానించాల్సింది మేయర్. అయితే ఇవాంకాకు ఆహ్వానం పలికినవారిలో ఆయన లేకపోవడం గమనార్హం.

అంతేకాకుండా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వీవీఐపీలు వచ్చినప్పుడు కూడా బల్దియా పాలకులకు పూచికపుల్ల విలువ కూడా ఇవ్వడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. హకీం పేటకు రాష్ట్రపతి వస్తే.. అది గ్రేటర్ పరిధికాదంటూ మేయర్‌కు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటున్నారు. శంషాబాద్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.