పీఓకే ఎన్నికలపై భారత్ కన్నెర్ర.. వెళ్లిపోవాలని పాక్‌కు హెచ్చరిక
భారత్ జూలు విదిలించింది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీరీల హక్కులంటూ గగ్గోలు పెడుతున్న పాకిస్తాన్ వేసిన ఎన్నికల పాచికపై కన్నెర్రజేసింది. పాక్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలకు జరపడానికి పాక్ సుప్రీం కోర్టు అనుమతివ్వడంపై భారత విదేశాంత శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేశారు.
ఆ ప్రాంతంలోపాటు జమ్మూ కశ్మీర్, లడఖ్ మొత్తం తమకే చెందుతాయని, ఆక్రమించిన భూభాగం నుంచి పాక్ వెంటనే తప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. గిల్గిత్-బాల్టిస్థాన్‌లో ఇదివరకు ఎన్నికలు ఉండేవి కావు. దాన్ని ‘చట్టబద్ధంగా’ చేజిక్కించుకోడానికి పాక్ కుటిలబుద్ధితో 2018లో చట్టం తీసుకురాగా అక్కడి సుప్రీంకోర్టు గతవారం దానిపై రబ్బరు స్టాంపు వేసింది. తమ భూభాగంపై ఇలాంటి నాటకాలేవీ చెల్లవని భారత్ ఘాటుగా స్పందించింది. దీనిపై తమకు జవాబు చెప్పాలని పాక్ రాయబారిని మందలించింది.
70 ఏళ్లుగా పాకిస్తాన్ తమ భూభాగాన్ని ఆక్రమించుకుని, అక్కడి ప్రజల హక్కులు కాలరాస్తోందని విదేశాఖ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గిల్గిత్-బాల్టిస్తాన్‌పై సర్వాధికారాలూ తమవేనని, దానిపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్ సుప్రీం కోర్టుకు లేవని ఆ దేశ దౌత్యవేత్తకు తేల్చిచెప్పింది.