ఐదేళ్ల వయసు పిల్లలేం చేస్తారు? స్కూలుకు వెళ్తారు, ఆడుకుంటారు. పాఠాలు బట్టీ కొడతారు. కొందరికి ఏబీసీడీలు కూడా సరిగ్గా రావు. కొందరు స్పష్టంగా మాట్లాడలేరు కూడా. కానీ ఓ ఐదేళ్ల పిల్ల ఏకంగా పుస్తకం రాసి, అచ్చేసి గిన్నిస్ రికార్డులకెక్కింది. రికార్డు కోసం ఏది పడితే అది రాసి, ఐదారు పుస్తకాలు జిరాక్స్ ప్రింట్లు తీసి వుంటుందిలే అని అనుకోకండి. ఆ అమ్మాయి చక్కని కథతో పుస్తకం రాసి, అచ్చేసి వెయ్యికిపైగా కాపీలు అమ్మి మరీ ఈ ఘనత సాధించింది.
బ్రిటన్లోని వేమౌత్కు చెందిన బెల్లా డార్క్ ప్రపంచంలో అత్యంత పిన్నవయస్కురాలైన రచయిత్రిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. చిన్నారి రాసిన పుస్తకం పేరు ‘తప్పిపోయిన పిల్లి’(Lost Cat). స్నోవీ అనే పిల్లి రాత్రి పూట బయట తిరుగుతూ తప్పిపోవడం, పిల్లలు ఆ పిల్లిలా బయటికి వెళ్లి తప్పిపోవద్దని హెచ్చరించడం అందులోని కథ. జింజర్ ఫైర్ ప్రెస్ కంపెనీ ఈ పుస్తకాన్ని ఈ ఏడాది జనవరిలో వెయ్యి కాపీలు అచ్చేసింది. పుస్తకం ధర 6 పౌండ్లు. బెల్లా కేవలం ఐదంటే ఐదే రోజుల్లో ఈ పుస్తకం రాసి పడేసింది.