అందరూ చూస్తుండగా యువతి కిడ్నాప్ - MicTv.in - Telugu News
mictv telugu

అందరూ చూస్తుండగా యువతి కిడ్నాప్

August 14, 2020

Girl incident in daylight in Karnataka, CCTV footage goes viral.

సినిమాల్లో కనిపించే దృశ్యాలను కొంతమంది నిజజీవితంలో అవలంభించి షాక్ ఇస్తున్నారు. పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువతిని యువకుడు కిడ్నాప్ చేశాడు. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కర్ణాటకలోని కోలార్ పట్టణంలోని ఎంబీ రోడ్డులో ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళుతున్నారు. మంచి ట్రాఫిక్ ఉంది. చుట్టపక్కలంతా జనాలు ఉన్నారు. ఇంతమంది ఉన్నా కిడ్నాపర్ ఏమాత్రం సంశయించకుండా కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. వారికి ఎదురుగా ఒక ఇన్నోవా కారు వచ్చి ఆగింది. కారులోంచి దిగిన యువకుడు ఆ ఇద్దరు యువతులలో ఓ యువతిని బలవంతంగా ఎత్తుకుని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. ఊహించని పరిణామానికి రెండో యువతి షాక్ అయిపోయింది. 

వెంటనే కిడ్నాపర్‌ను నిలువురించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వచ్చినంత వేగంగా వాహనాన్ని స్టార్ట్ చేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో ఆమె వెంటనే గల్‌‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్దలానికి చేరుకున్నారు. సమీపంలోని షాపులు వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని ముందుగా పరిశీలించారు. కిడ్నాప్‌కు పాల్పడ్డ యువకుడిని కోలారు నగరంలోని దేవాంగపేటకు చెందిన 23 ఏళ్ల శివుగా గుర్తించారు. తమ ప్రేమను యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతోనే శివు కిడ్నాప్‌కు పాల్పడ్డాడని గుర్తించారు. కాగా, శివు ఆచూకి తెలుసుకున్న పోలీసులు,  యువతిని తీసుకు వచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.