Girl jumps off speeding auto rickshaw after driver tries to molest her in Aurangabad
mictv telugu

కీచక డ్రైవర్.. ఆటో నుంచి దూకేసిన బాలిక.. వీడియో

November 16, 2022

ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ మైనర్ బాలికపై ఆ ఆటో డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు వేరే దారి లేక కదులుతున్న ఆటో నుంచి కిందకు దూకేసింది. దీంతో ఆ బాలికకు తీవ్రగాయాలయ్యాయి. ఈ భయంకర ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోడ్డుపై వెళుతున్న ఓ ఆటో నుంచి హఠాత్తుగా ఓ బాలిక కింద పడింది. ఆ ఆటో వెనుకే వస్తున్న కొందరు వాహనదారులు వెంటనే ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. కాపాడమంటూ ఆమె చేస్తున్న ఆర్తనాదాలు విని.. ఓ బైకర్ ఆమెను తన చేతుల్లోకి తీసుకోగా మరో వ్యక్తి తన షాపు నుంచి వాటర్ బాటిల్‌తో బయటకు వచ్చి బాధితురాలికి అందించాడు.

తలకి బలమైన దెబ్బ తగలడంతో ఆ బాలికను వెంటనే స్థానికంగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు డ్రైవర్ సయ్యద్ అక్బర్ హమీద్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు ఇన్‌స్పెక్టర్ గణపత్ దారాడే దీనిపై మాట్లాడుతూ.. మైనర్ విద్యార్థి అయిన ఆ బాలిక ఉస్మాన్‌పురా ప్రాంతం నుండి ఆటోరిక్షాలో తన ఇంటికి వెళుతుండగా, డ్రైవర్ అసభ్యంగా మాట్లాడి బాలికను వేధించాడు. ఏదో అనర్ధం జరగబోతుందని ముందే ఊహించిన బాలిక.. హఠాత్తుగా ఆటో నుంచి దూకిందని చెప్పారు. ఔరంగాబాద్‌లోని సిల్లి ఖానా కాంప్లెక్స్ వద్ద జరిగిన ఈ ఘటనలో బాలిక తలకు గాయమై ఆసుపత్రిలో చేరిందని చెప్పారు.