పెద్దలూ.. ఇది చూసైనా ప్రేమను గౌరవించండి! - MicTv.in - Telugu News
mictv telugu

పెద్దలూ.. ఇది చూసైనా ప్రేమను గౌరవించండి!

February 15, 2018

ప్రేమకు కులమతాలు ఉండవు. ధనం, మతం, కులం, డబ్బు, అంతస్తులు.. వేటితోనూ ప్రేమకు సంబంధం లేదు. రెండు మనసులు కలిస్తే చాలు. కానీ ఈ సత్యాన్ని కొందరు పెద్దలు ఒప్పుకోరు. అందరం మనుషులమేనన్న సంగతిని విస్మరిస్తారు. దీంతో చెప్పలేనన్ని అనర్థాలు జరుగుతాయి. దీంతో తర్వాత తీరిగ్గా చింతించం పెద్దల వంతు అవుతుంది. తమిళనాడు కోయంబత్తూరులో అలాంటి విషాదం జరిగింది.

నగరానికి చెందిన ఒక యువతి, ఒక యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. నిన్న ప్రేమికుల రోజు సందర్భం‍గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే వారు అందుకు ఒప్పుకోలేదు. తాము చూసిన వాళ్లనే పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తామని, తామూ చనిపోతామని బెదిరించారు. దీంతో తీవ్రంగా కలత చెందిన యువతి బలవన్మరణానికి పాల్పడింది. కానీ ఆమె మనసంతా వలచిన వాడిపైనే ఉంది. అతనికి భార్య అయి పునిస్త్రీగా చనిపోగా కోరుకుంది. ఆ విషయాన్ని సూసైడ్ నోట్‌లో రాసింది. తను చనిపోయాక అతనితో తన మెడలో తాళి కట్టించాలని, ఆ తర్వాతే అంత్యక్రియలు పూర్తి చేయాలని కుటుంబ సభ్యులను కోరింది.

ఈ లేఖ చదివిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఆమె కోరికను నెరవేర్చాలనుకున్నారు. అతనికి కబురు చేశారు. అతడు కన్నీటిసుడుల మధ్య నీర్జీవంగా మారిపోయిన తన ప్రియురాలి మెడలో తాళి కట్టాడు. ఈ దృశ్యాలను చూసిన వారంత కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇలాంటివి పునరావృతం కావొద్దంటే మనుషులు మారాలి. ప్రేమను గౌరవించాలి.. !!