Girlfriend was getting married, the lover reached the pavilion donating vermilion again
mictv telugu

ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు.. ఒకటి ప్రియురాలితో.. మరొకటి..

July 7, 2022

Girlfriend was getting married, the lover reached the pavilion donating vermilion again

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కలసి జీవిద్దామనుకున్నారు. కానీ ఇంతలోనే యువతి కుటుంబ సభ్యులు ఆమెకు మరో సంబంధం చూశారు. పెళ్లి చూపుల దగ్గరి నుంచి పెళ్లి మండపం వరకూ అన్ని కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయి. తన ప్రియురాలు తనకు ఇక దక్కదేమో అనుకొని.. ఆ యువకుడు పెద్ద సాహాసమే చేశాడు. సరిగ్గా ముహూర్తం సమయానికి పెళ్లి మండపం పైకి చేరుకొని అక్కడున్న వరుడిని పక్కకు తోసి.. ప్రేమించిన అమ్మాయి మెడలో వరమాల వేసి, నుదుట సింధూరం దిద్దాడు. ఇక పెళ్లి అయిందనుకున్నాడు. ఇక వధువు బంధువులు మరో రకంగా పెళ్లి జరిపించారు. బీహార్‌లోని ముబారక్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. సందడిగా ఉన్న పెళ్లి మండపం ఎక్కిన యువకుడు ముకేష్‌ కుమార్‌.. పెళ్లి కూతురి అలంకారంలో ఉన్న తన ప్రేయసి నుదుట సింధూరం పెట్టేశాడు. ఏం జరుగుతుందో తెలియక పెళ్లి కుమారుడు షాక్‌ తింటే.. అక్కడే ఉన్న ఓ మహిళ.. ముకేష్ చెంప చెల్లుమనిపించింది. ఇక, వధువు బంధువులు ఆ యువకుడికి చుక్కలు చూపించారు. అతడిపై దాడి చేసి ఘనంగా ‘పెళ్లి’ చేశారు. ఈ ఘటనలో ముకేష్‌ తలపై, ముఖానికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆ తర్వాత పెళ్లికి వచ్చిన పెద్దలు గ్రామస్తుల సహాయంతో ఆస్పత్రిలో చేర్చారు. పెళ్లి మండపంలో జరిగిన వ్యవహారంపై వధువు తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. ముకేష్‌ను విచారించారు.
అయితే, పోలీసుల విచారణలో అసలు కథ బయట పడింది.. ఆ యువకుడు చెప్పిన విషయాలతో అంతా షాక్‌ అయ్యారు. తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుందామని భావించినా వారి ఇంట్లో ఒప్పుకోలేదని.. అంతేకాదు మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమయ్యారని తెలిపాడు. తన ప్రియురాలు తనకు ఫోన్‌ చేసి.. పెళ్లికి రావాలని.. పెళ్లి సమయంలో తన నుదుట సింధూరం పెట్టాలని కోరిందని వెల్లడించారు. అందుకే తాను పెళ్లిలో అలా చేసినట్టు చెప్పుకొచ్చాడట.. అయితే ఆ తర్వాత మాత్రం ఏం చేయాలనే విషయం ప్రియుడికి చెప్పలేదట. పాపం ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రిలో ఉంటే.. యువతి కుటుంబ సభ్యులు మాత్రం ఈ తతంగం అంతా అయ్యాక సంబంధం కుదుర్చుకున్న వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేశారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చగా మారిపోయింది.