బాలిక మెడచుట్టు పంటిగాట్లు, గాయాలు.. నివేదిక వెల్లడి - MicTv.in - Telugu News
mictv telugu

బాలిక మెడచుట్టు పంటిగాట్లు, గాయాలు.. నివేదిక వెల్లడి

June 11, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మే 28న జూబ్లీహిల్స్ పబ్‌లో బాలికను ట్రాప్ చేసి, పక్కా ప్రణాళికతోనే కొంతమంది యువకులు బాలికను కారులో తీసుకెళ్లి, నిర్జన ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎంత కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఘటనకు సంబంధించి తండ్రి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని, విచారణ చేస్తున్నారు. బాలికపై జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించి శుక్రవారం వైద్యులు పోలీసులకు ఓ నివేదికను అందజేశారు.

ఆ నివేదిక ప్రకారం..’లైంగిక దాడి జరిగే సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో బాలిక లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమెపై గోళ్లతో దాడికి చేయడంతో బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నాయి. దాదాపు ఏడెనిమిది చోట్ల పంటితో కొరికిన గుర్తులు, మెడ చుట్టూ గోళ్లతో రక్కన ఆనవాళ్ళు’ ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

మరోవైపు పోలీసులు సామూహిక అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. మరింత స్పష్టతకోసం ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటన జరిగిన రోజు నుంచి నిందితులు రోజుకో ప్రాంతం మారుతూ మొబైల్ ఫోను, సిమ్ కార్డులు మారుస్తూ పోలీసులను ఏమార్చారు. ఈ వ్యవహారంలో నిందితులను తప్పించేందుకు తెర వెనుక సహకరించిన పెద్దలు ఎవరనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్(18)ను శుక్రవారం బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ సుమారు అరగంట ప్రశ్నించారు. బెంజ్ కారు నుంచి ఇన్నోవా కారులోకి బాలికను మార్చటానికి గల కారణాల గురించి ఆరా తీశారు.

ఈ క్రమంలో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించి వైద్యులు పోలీసులకు అందజేసిన నివేదికను బట్టి చూస్తే, నిందితులు బాలిక పట్ల చాలా దారుణంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. లైంగికంగా వేధిస్తూ, పంటితో, గోర్లతో తీవ్రంగా దాడి చేసినట్లు వైద్యులు నిర్ధిరించారు.