గీతను పెళ్లాడ్డానికి మంచి బధిరుడు కావలెను.. - MicTv.in - Telugu News
mictv telugu

గీతను పెళ్లాడ్డానికి మంచి బధిరుడు కావలెను..

April 13, 2018

గీత గుర్తుందా? పొరపాటున పాకిస్తాన్ వెళ్లి అక్కడే పెరిగి,  తిరిగి భారత్ చేరుకున్న పిల్ల. ప్రస్తుతం ఇండోర్‌లోని ఓ ఎన్జీవోలో నివసిస్తోంది. గీతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మూగ, బధిరురాలైన గీతకు మంచి, తెలివైన వరుడు కావాలని, వయసు పాతికేళ్లలోపు ఉండాలని ఒక ప్రకటన విడుదల చేశారు. గీత బాగోగులు చూస్తున్న సహాయకుడు జ్ఞానేంద్ర పురోహిత్‌ తన ఫేస్‌బుక్‌లో ఈమేరకు పోస్ట్ పెట్టాడు.

‘మంచి, తెలివైన బధిరుడు కావాలి. అతనికి 25 ఏళ్లు ఉండాలి. మా భారత పుత్రిక గీతను పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ వివరాలను పంపండి. గీత పెళ్లి విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది’ అని తెలిపాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విలేకర్లు విషయమేంటని ఇండోర్‌ కలెక్టర్‌ నిశాంత్‌ వార్వాడే అడిగారు. ఈ సంగతి మీరు చెప్పేదాకా నాకూ తెలియదని ఆయన అన్నాడు. పురోహిత్‌ను సంప్రదించగా.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆలోచన మేరకు గీతకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నామన్నాడు. ‘గీతకు మంచి సంబంధం చూడాలని ఆమె నాకు  చెప్పారు. వరుడి కోసం ఢిల్లీ, జయపుర వెళ్తున్నాం..’ అని తెలిపాడు.

గీత 15ఏళ్ల కింద పొరపాటున లాహోర్‌ నుంచి సంజౌతా ఎక్స్‌ప్రెస్‌లో పాక్ వెళ్లింది. పాక్‌ జవాన్లు ఆమెను అదుపులోకి తీసుకుని, తర్వాత ఈదీ ఫౌండేషన్‌ కు అప్పగించారు. 2016లో సుష్మ చొరవతో గీత భారత్‌ చేరుకుంది. ఆమె తమ కూతురని చాలామంది ముందుకొస్తున్నా పంచాయతీ తెగడం లేదు.