75 ఏళ్ల వయసులో పువ్వు ఇచ్చి.. ప్రపోజ్ చేసిన వృద్ధుడు - MicTv.in - Telugu News
mictv telugu

75 ఏళ్ల వయసులో పువ్వు ఇచ్చి.. ప్రపోజ్ చేసిన వృద్ధుడు

May 30, 2022

ఉత్తరప్రదేశ్‌లో ఓ 72 ఏళ్ల వృద్దురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, 75 ఏళ్ల వయసున్న తన భర్త గతకొన్ని నెలలుగా తనను ప్రేమించడం లేదని, సరిగ్గా చూసుకోవటం లేదని ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక కొన్ని నిమిషాలపాటు షాక్‌కు గురైయ్యారు.

లలిత్‌పూర్‌లో నివాసముంటున్న ఓ 72 ఏళ్ల వృద్ధురాలు, 75 ఏళ్ల తన భర్తపై ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కి వచ్చింది. కొడుకు, కోడలు చెప్పిందే విని, ఆస్తి అంతా వాళ్లకే ఇచ్చేశాడని, చిన్న చిన్న ఖర్చులకు కూడా ఆమెకు డబ్బులు ఇవ్వటం లేదని తెలిపింది. వెంటనే ఆమె భర్తను పిలిపించారు. ఎవరితోనూ ఆమె సఖ్యంగా ఉండదని, అందరితోనూ గొడవలు పడుతుందని, నన్ను కూడా తిడుతుందని ఆమె భర్త చెప్పాడు. వారి వాదనలు విన్న తర్వాత పోలీసులు ఇద్దరి మధ్య సంధి కుదిర్చి, వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉండాలని నచ్చ చెప్పారు. దాంతో వృద్ధ దంపతులు రాజీ పడ్డారు.

అనంతరం ఆ వృద్ధుడు తన భార్యకు గులాబీ పువ్వు ఇచ్చి `నేను నిన్ను ప్రేమిస్తున్నాను` అని చెప్పాడు. వెంటనే ఆ వృద్ధురాలు తన భర్త పాదాలను మూడుసార్లు తాకి, `నన్ను బాగా చూసుకో` అని కోరింది. ఆ తర్వాత ఆ వృద్ధ దంపతులు నవ్వుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు. ఈ ఘటనను వీక్షించిన పోలీసులు ఆనందంతో చిరునవ్వులు నవ్వారు. ఆ వృద్దుడు ప్రపోజ్ చేస్తుండగా వీడియోలు, ఫోటోలు తీస్తూ, తెగ ఎంజాయ్ చేశారు.