పిల్లలకు సైకిల్ ఇస్తున్నారా.. అయితే ఇది చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లలకు సైకిల్ ఇస్తున్నారా.. అయితే ఇది చూడండి

March 25, 2022

boy

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదీ కావాలన్నా, వెనకముందు ఆలోచించకుండా ఆ వస్తువును కొనిస్తుంటారు. కానీ, ఆ వస్తువు వల్ల తమ పిల్లలకు ఏదైనా అపాయం ఉందా లేదా అని మాత్రం ఆలోచించారు. అలా కేరళ రాష్ట్రానికి చెందిన ఓ తల్లిదండ్రులు.. తమ 9 ఏళ్ల బాలుడికి సైకిల్‌ను కొనిచ్చారు. కానీ, ఆ పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏ స్థలంలో సైకిల్ తొక్కుతున్నాడు? రోడ్డు మీదికి వెళ్తున్నాడా, లేక ఇంట్లోనే ఉన్నాడా? అనే విషయాలను మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆ పిల్లవాడు సైకిల్ తొక్కుకుంటూ రోడ్డుపైకి వెళ్లి.. ఓ వాహనాన్ని ఢీకొట్టి, తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కన్నూరు జిల్లా తాలిపారంబాకు సమీపంలోని చోరుక్కల వద్ద ఆదివారం (మార్చి 24) సాయంత్రం ఆ కుర్రాడు ఆడుకుంటూ సైకిల్ తీశాడు. ఇంటి నుంచి బయల్దేరి వేగంగా తొక్కుకుంటూ మెయిన్ రోడ్డు వరకు చేరుకున్నాడు. వేగంగా వచ్చి అదుపు తప్పాడు. దీంతో కంట్రోల్ చేయలేక రోడ్డు మీద వెళ్తున్న బైకును ఢీకొట్టి ఎగిరి రోడ్డవతల పడ్డాడు. అయితే, ఆ వెనకే బస్సు వస్తోంది. సైకిల్ రోడ్డు మీద పడిపోగా, చిన్నారి కొద్దిలో బస్సు చక్రాల కింద పడకుండా తప్పించుకోగలిగాడు.

ఈ క్రమంలో సైకిల్ పైకి బస్సు ఎక్కేసింది. రోడ్డు మీద ఎగిరిపడినా.. చిన్న గాయం లేకుండా బయటపడగలిగాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అది చూసిన వాళ్లంతా అమ్మో అనుకుంటున్నారు. తెలంగాణ పోలీసులు ఆ వీడియోను ట్వీట్ చేసి, కామెంట్ చేయాలంటూ నెటిజన్లను అడిగారు. అంతా తల్లిదండ్రుల పెంపకంలోనే ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.