బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే నుంచి మరో పార్టీ బయటికి వచ్చింది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా గోరఖ్ జనముక్తి మోర్చా(జీజేఎం) ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పింది. 12 ఏళ్లగా ఎన్డీయే కూటమిలో ఉన్న జీజేఎం ఇప్పుడు బయటికి వచ్చింది.
ఇంతవరకు అజ్ఞాతంలో వున్న జీజేఎం అధినేత బిమల్ గురుంగ్ నిన్న బయటకువచ్చి, తాము ఎన్డీయేను వీడుతున్నట్టు ప్రకటించారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తామన్నారు. డార్జిలింగ్ పర్వతశ్రేణి అభివృద్ధిని కేంద్రం విస్మరించిందని బిమల్ ఆరోపించారు. అలాగే 11 గోరఖ్ సముదాయాలను బలహీన వర్గాల జాబితాలో చేరుస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదన్నారు. గురుంగ్ హత్య, యూఏపీఏ కేసులు ఎదుర్కొంటూ 2017 నుంచి పరారీలో ఉన్నారు. అతను గతకొన్ని రోజులుగా డార్జిలింగ్‌లో కాలుమోపాలని ప్రయత్నిస్తున్నారు.