ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్ సెంట్రల్ విస్టా నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. ప్రస్తుతం ఉన్న పాత భవనానికి దగ్గర్లోనే దీన్ని నిర్మించారు. బడ్జెట్ సెషన్ రెండవ భాగాన్ని ఈ భవనంలో నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ భవనాన్ని ఈ మార్చిలో ప్రారంభించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి ఇటీవలే భవనం లోపలి ఫోటోలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ లోపల భాగం ఫోటోలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. ఇందులో భారతదేశం కొత్త పార్లమెంట్ హౌస్ బయట నుండి ఎంత గొప్పగా ఉంటుందో, లోపల నుండి మరింత అందంగా కనిపిస్తుంది.
త్రికోణ ఆకృతిలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. అందులోని లోక్సభ జరిగే భవనం పై కప్పును నెమలి పించంలా డిజైన్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనం లోపల 888 మంది పార్లమెంట్ సభ్యులకు సీట్లు ఉంటాయి. ఇక జాతీయ పుష్పం.. లోటస్ థీమ్ పై రూపొందించిన రాజ్యసభ హాల్ గరిష్టంగా 384 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదనపు సీటింగ్ కోసం స్థలం కూడా ఉంది. ఉమ్మడి సమావేశాల సమయంలో హాలులో మొత్తం1,272 సీట్లు ఉంటాయి.
కొత్త పార్లమెంటు భవనంలో లైబ్రరీ, లాంజ్, క్యాంటీన్, కమిటీ హాల్, పార్కింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. కొత్త పార్లమెంట్ భవనాన్ని పూర్తిగా భూకంపం తట్టుకునేలా తీర్చిదిద్దారు. నాలుగు అంతస్థుల పార్లమెంట్ భవనం కొత్త భవన నిర్మాణానికి సుమారు రూ.971 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. బహిరంగ ప్రాంగణానికి అనుబంధంగా సెంట్రల్ లాంజ్ ఉంది. ఇందులో జాతీయ వృక్షం మర్రి చెట్టు ఉంటుంది.
సెంట్రల్ విస్టా రీ డెవలప్ మెంట్ లో భాగంగా నూతన పార్లమెంట్ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఇందులో పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు కొన్ని కమిటీ గదులు కూడా ఉన్నాయి. అత్యాధునిక రాజ్యాంగ హాలు ఉంటుంది.ఆధునిక భారతదేశపు వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రాంతీయ కళలు, చేతికళతో చిత్రాలను కొత్త పార్లమెంట్ భవనంలో పొందుపర్చనున్నారు. భవనంలో సురక్షితమైన, సమర్థవంతమైన కమ్యూనికేషన్ టెక్నాలజీతో అల్ట్రా మోడ్రన్ ఆఫీస్ స్పేస్ ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనం 65,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. పార్లమెంట్ సజావుగా సాగేందుకు కొత్త, ప్రస్తుత భవనాలు సమిష్టిగా పనిచేస్తాయని ప్రభుత్వం తెలిపింది.
గత కొన్ని దశాబ్దాలుగా డీ లిమిటేషన్ల కారణంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడంతో నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం చేపట్టారు. 2020 డిసెంబర్ 10న వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కేబినెట్ మంత్రులు, వివిధ దేశాల రాయబారుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో కొత్తపార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు.
నూతన పార్లమెంట్ భవనంపై ప్రతిష్టించిన జాతీయ చిహ్నమైన మూడు సింహాల విగ్రహాన్ని గతేడాది జూలై నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ నూతన పార్లమెంట్ భవనంలో పెద్ద హాళ్లు, లైబ్రెరీ, సౌకర్యవంతమైన పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉంటాయి. అత్యంత సాంకేతికతలతో ఈ భవనంలో ఏర్పాట్లు సమకూర్చారు.