అమ్మాయిలూ కూడా తక్కువేం కాదు.. తెగ కాల్చేస్తున్నారు - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మాయిలూ కూడా తక్కువేం కాదు.. తెగ కాల్చేస్తున్నారు

June 1, 2022

పురుషులే కాదు ప్రస్తుత కాలంలో మహిళలు కూడా పొగతాగడం ఎక్కువైంది. ముఖ్యంగా పార్టీ, పబ్‌కల్చర్‌ పెరిగిన ఈ రోజుల్లో చాలామంది యువతులు కూడా ధూమపానానికి అలవాటు పడుతున్నారు. గ్లోబల్‌ అడల్ట్‌ టొబాకో గతంలో చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆ సర్వే ప్రకారం 2025 నాటికి మహిళల్లో ధూమపానం ప్రాబల్యం 20 శాతానికి పెరిగే ముప్పు ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

ఒత్తిడి కారణంగానో లేదా విశ్రాంతి సమయంలో ఆటవిడుపు కోసమో అమ్మాయిలు కూడా అడపాదడపా సిగరెట్లు కాలుస్తున్నారు. సరదా కోసం మొదలైన ఈ అలవాటు వారిని వ్యసనంగా మార్చుతుంది. వివిధ రూపాల్లో పొగాకు తీసుకోవడం వల్ల చాలామంది జీవితాలను అర్ధంతరంగా ముగిస్తున్నారు. అదేపనిగా దీర్ఘకాలంగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఇతర క్యాన్సర్ల బారిన పడతున్నారు. ముఖ్యంగా 30-49 ఏళ్ల మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరుగుతున్నాయి. రొమ్ము ఇతర క్యాన్సర్లకంటే ఎక్కువ మంది మహిళలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మృతిచెందుతున్నారు. సిగరెట్ కాల్చే వారిలోక్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌(సీవోపీడీ) వచ్చే ముప్పు ఎక్కువ. ఈ వ్యాధి వల్ల శ్వాస తీసుకోవడం కష్టతరంగా మారుతుంది. కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు తప్పదు. ఏటా ఈ వ్యాధి వల్ల పురుషులకంటే మహిళలే ఎక్కువగా మరణిస్తున్నారు.