ఆకలి నివేదిక.. పాక్, బంగ్లా కంటే భారత్‌లోనే ఎక్కువ  - MicTv.in - Telugu News
mictv telugu

ఆకలి నివేదిక.. పాక్, బంగ్లా కంటే భారత్‌లోనే ఎక్కువ 

October 17, 2020

Global Hunger Index 2020: India ranks 94 out of 107 countries, slight improvement since 2019

ఉన్నమారాజులు సకల సౌఖ్యాల నడుమ బిందాస్‌గా ఉంటున్నారు. లేనివారు ఆకలికి కూడా అలమటిస్తూ రోజులు వెళ్లదీస్తున్నారు. ఇదీ తరతరాలుగా మన భారత్ తీరు. కూడు గూడు గుడ్డకు నోచుకోలేని అభాగ్యులు ఎందరో ఈ దగాపడ్డ దేశంలో. ఎందరో పిల్లలు పోషకాహార లోపంతో తల్లడిల్లుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఐ (ప్రపంచ ఆకలి సూచిక)లో మన భారత్ 94వ స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి స్థాయులు, పోషకాహార లోపాలను జీహెచ్ఐ సూచిస్తుంది. 107 దేశాల జాబితాలో భారత్ స్థానం 94లో ఉంది. ఇక దాయాది దేశం పాకిస్థాన్‌ 88వ స్థానంలో నిలిచింది. నేపాల్‌ 73వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్‌ 75వ స్థానంలో నిలిచింది. 64వ స్థానంలో శ్రీలంక నిలిచింది. ఆయా దేశాల కన్నా భారత్ పరిస్థితి మరీ దిగజారింది. ఈ మేరకు జీహెచ్‌ఐ వార్షిక నివేదికను కన్‌సర్న్‌ హంగర్‌, వెల్తుంగర్‌ హిల్ఫ్‌ సంస్థలు సంయుక్తంగా ప్రచురించాయి.

మరోపక్క నైజీరియా, లైబీరియా, రువాండా, చాడ్, అఫ్గానిస్థాన్‌, మొజాంబిక్ వంటి 13 దేశాలు మనదేశం కన్నా దిగజారి ఉన్నాయి. మన దేశ జనాభాలో 14 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నివేదక పేర్కొంది. 27.2 పాయింట్లతో భారత్ తీవ్రమైన విభాగంలో ఉందని స్పష్టంచేసింది. చిన్నపిల్లల ఎదుగుదల లోపం (స్టటింగ్ రేట్) కూడా 37.4గా ఉన్నట్లు వివరించింది. వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, దీర్ఘకాలిక పోషకాహార లోపంతో బాధపడేవారిని స్టంటెడ్ చిల్డ్రన్‌గా పేర్కొంటారు. చాలా దేశాల్లో పరిస్థితి అత్యంత నెమ్మదిగా మెరుగు పడుతోందని.. మరికొన్ని దేశాల్లో పరిస్థితి దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 1991 నుంచి 2014 వరకు బంగ్లాదేశ్‌, భారత్. నేపాల్, పాకిస్థాన్‌ దేశాల్లో పిల్లల్లో ఎదుగుదల లోపానికి ఆహారంలో వైవిధ్యం, పేదరికం, తక్కువ స్థాయి మెటర్నల్ ఎడ్యుకేషన్ ప్రధాన కారణాలు అవుతాయని వెల్లడించింది. కాగా, మితమైన, తీవ్రమైన లేక భయంకరమైన విభాగాల్లోని 46 దేశాల ఆకలి సూచీ మెరుగుపడిందని వివరించింది. ఆ విభాగాల్లోని 14 దేశాల పరిస్థితి మాత్రం మరింత అధ్వానంగా తయారైందని చెప్పింది.