వైద్య విద్యార్థులకు జీఎంయూ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

వైద్య విద్యార్థులకు జీఎంయూ ఆఫర్

March 10, 2022

ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని ప్రజల జనజీవనం దారుణంగా తయారైంది. ఉన్న పళంగా చదువులు, ఉద్యోగాలు, బిజినెస్‌లను వదిలేసి ప్రజలు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ తరుణంలో భారత్ నుంచి ఉక్రెయిన్‌కి వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు జీఎంయూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘ఒక భారతీయుడిగా తోటి భారతీయ విద్యార్థులకు ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేయడం నా బాధ్యత. యుద్ధం కారణంగా చెల్లాచెదురైన విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు, వారి విద్య పూర్తి అయ్యేందుకు సాయం అందిస్తాం’ అని తంబే గ్రూపు వ్యవస్థాపకుడు, గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రెసిడెంట్ తంబే మొయినుద్దీన్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”ఉక్రెయిన్ నుంచి అర్ధంతరంగా భారత్‌కు వెనక్కి వచ్చేసిన వైద్య విద్యార్థులకు యూఏఈలోని గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ (జీఎంయూ) ఆహ్వానం పలుకుతుంది. ఉచిత సీట్లతోపాటు, ప్రతిభావంతులకు స్కాలర్ షిప్‌లు సైతం అందిస్తాం. యూనివర్సిటీ అడ్మిషన్ కౌన్సిలర్లు విద్యార్థులకు కావాల్సిన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తాం. వీసా సమకూర్చడం దగ్గర నుంచి.. వసతులు, అడ్మిషన్ బదిలీ వరకు అన్ని వ్యవహారాల్లో సాయం చేస్తాం” ఆయన అన్నారు.

అంతేకాకుండా యూనివర్సిటీ అడ్మిషన్ విధానానికి అనుగుణంగా విద్యార్థులు వైద్య విద్యకు సంబంధించి ఎన్నో ప్రోగ్రామ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. ఇటలీ, ఘనా, పోలండ్, మలేషియాలోని అంతర్జాతీయ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ తంబే గ్రూపు నిర్వహణలో ఉంది అని పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.