Goa tourism department issues notice to Yuvraj Singh over his villa
mictv telugu

చిక్కుల్లో పడిన యువరాజ్ సింగ్… కొంప ముంచిన ఆన్‌లైన్‌ ప్రకటన

November 23, 2022

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా గోవాలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో ప్రకటన ఇవ్వడంతో గోవా అధికారులు అతనికి నోటీసులు అందజేశారు. ఇచ్చిన గడువులోపు హాజరై తగిన వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..యువరాజ్ సింగ్ కు గోవాలోని మోర్జిమ్ లో ఓ విలాసవంతమైన భవనం ఉంది. కాసా సింగ్ పేరుతో ఉన్న ఈ లగ్జరీ విల్లాను టూరిస్టులకు అద్దెకు ఇస్తానని యువరాజ్ సింగ్ ఆన్ లైన్‌లో ఓ ప్రకటన ఇచ్చాడు. అయితే గోవా చట్టాల ప్రకారం ఇంటిని పేయింగ్‌ గెస్ట్‌ కోసం ఇవ్వాలంటే తప్పకుండా గోవా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్-1982 ప్రకారం నమోదు చేయించుకోవాలి.

అయితే యువరాజ్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే, ఇంటిని పర్యాటకుల కోసం అద్దెకు ఇస్తామని ప్రకటన ఇవ్వడంపై గోవా అధికార వర్గాలు స్పందించాయి. టూరిజం శాఖ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అద్దెకు ఇస్తామని ప్రకటించడం నిబంధనలకు వ్యతిరేకమని, అందుకు రూ.1 లక్ష జరిమానా విధిస్తున్నట్టు గోవా టూరిజం శాఖ అధికారులు వెల్లడించారు. హోటల్ అయినా, గెస్ట్ హౌస్ అయినా, విల్లా అయినా ఆతిథ్య కార్యకలాపాలు నిర్వహించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని గోవా సర్కారు స్పష్టం చేసింది. జారీ చేసిన నోటీసులకు డిసెంబరు 8న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని యువరాజ్ సింగ్‌ను గోవా ప్రభుత్వం ఆదేశించింది.