Goat brought to be sold hugs owner, cries like human: Watch viral video
mictv telugu

యజమానికి దూరమవుతూ.. వెక్కి వెక్కి ఏడ్చిన మేక

July 13, 2022

భావోద్వేగాలు మనుషులకే కాదు.. విశ్వాసం ప్రదర్శించే పెంపుడు జంతువులకూ ఉంటాయి. మూగజీవాలైనా.. సైగలతో, చేష్టలతో తమను పెంచిన యజమానులను అమితంగా ప్రేమిస్తాయి. కుక్క, పిల్లి, ఆవు మొదలైన జంతువులను.. వాటి యజమాని దూరమైతే కన్నీరు పెట్టుకున్న అనేక సందర్భాలు ఇంతకుముందు వార్తల్లో చూశాం. అయితే తాజాగా ఓ మేక… తన యజమాని నుండి వీడి వెళ్లిపోతున్నానని.. బాధతో వెక్కి వెక్కి ఏడ్చింది. బక్రీద్ సందర్భంగా తనను అమ్మడానికి మార్కెట్ కు తెచ్చిన యజమానిని హత్తుకుని మనిషిలా ఏడ్వడం ప్రారంభించింది. ప్రస్తుతం ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

ఆదివారం దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. బక్రీద్ సందర్భంగా ఓ మేకను అమ్మడానికి యజమాని మార్కెట్‌కు తీసుకుని వచ్చాడు. అనంతరం మేకను అమ్మి.. డబ్బులు తీసుకున్నాడు. ఇలా ఒప్పందం జరుగుతున్న సమయంలో ఆ మేక.. అచ్చం మనిషిలా ఏడుస్తోంది. దూరమవుతున్న బాధను ఏడుపు రూపంలో యజమాని భుజంపై తల పెట్టి.. వలా వలా ఏడ్చింది. మేక ఏడుపు విన్న అక్కడున్న వాళ్లందరూ అయ్యో.. అంటూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మేక యజమాని కూడా దానిని కౌగిలించుకున్నాడు. ఈ భావోద్వేగ సంఘటన నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. మేక ప్రేమకు ఫిదా అవుతున్నారు. మేకను మార్కెట్ లోకి తీసుకువచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.