ఎవరైనా ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు వస్తే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా దగ్గరుండి చూసుకుంటారు. అలాంటిది పశ్చిమ బెంగాల్లో మేకలు పోలీసులతో సేవలు చేయించుకుంటున్నాయి. రాష్ట్రంలోని పూర్బ బర్థమాన్ జిల్లాలోని భతార్ స్టేషన్ పరిధిలో పోలీసులు నైట్ పెట్రోలింగ్ చేస్తుండగా వారికి రోడ్డుపై నాలుగు మేకలు కనిపించాయి.
వాటిలో ఒకటి చూడి మేక ఉంది. వాటి యజమాని చుట్టుపక్కల్లో కనిపించలేదు. దీంతో పోలీసులు ఆ మేకలను బతార్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడున్న చెట్టుకి వాటిని కట్టేసారు. ఈ సంఘటన జరిగి వారం కావస్తున్నా ఆ మేకల యజమాని ఆచూకీ దొరకలేదు. దీంతో స్టేషన్లోనే వాటికి ఆహారం అందించి, సంరక్షిస్తున్నాం. ఓ మేక ఇప్పటికే రెండు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిని చూసుకునేందుకు పోలీసులు ఓ సేవకుడిని కూడా ఏర్పాటు చేశారు. యజమాని వచ్చి తగిన ఆధారాలు సమర్పిస్తే వాటిని అతడికి అప్పగిస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.