దేవుడు ఆడనా? మగనా? - MicTv.in - Telugu News
mictv telugu

దేవుడు ఆడనా? మగనా?

December 8, 2017

దేవుడు ఆడనా? మగనా?

కాలానికి అతీతమైనది నమ్మకం. అది కంటికి కనిపించకపోవచ్చు. కానీ ఏదైనా సమస్య వస్తే అది వెన్నంటి ఉండే భరోసాలా నిలుస్తుంది. అందుకే  దేవుడనే నమ్మకం పురుడు పోసుకుంది. కోట్లాది మందిని నడిపిస్తుంది. అయినా సరే దేవుడు ఉన్నాడా? అన్న ప్రశ్న ఇప్పటికీ సమాధానం కోసం ఎదురుచూస్తోంది. అంతరిక్షపు అంచులను వెతుకుతున్న మనిషి కంటికి కనిపించనంత మాత్రానా దేవుడు అబద్ధం అని అనలేం. ఇవాళ నిజం కానిది రేపు కూడా నిజం కాకుండా పోతుందని చెప్పలేం. ఇందుగలడు అందుగలడని చెప్పుకునే ఆ సర్వాంతర్యామి ఏదో ఒకరోజు ఎక్కడో ఒకచోట వాస్తవంలా కనిపించాడే అనుకుందాం. ఆ రోజు కనిపించచే దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు అతడేనా? లేక  ఆమెనా? భగవంతుడు స్త్రీనా? పురుషుడా? సిల్లిగా అనిపించే ఈ ప్రశ్నకు సమాధానం సీరియస్ గా ఉంటుంది.

దేవుడు స్త్రీనా? పురుషుడా? అన్న ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పేవి మతాలే. ప్రపంచంలోని ప్రతీ మతం దేవుడి జెండర్ పై క్లారిటీ ఇచ్చింది. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న మూడు మత గ్రంథాలు, విశ్వాసాల ప్రకారం దేవుడు పురుషుడో, స్త్రీనో తెలుసుకుందాం.

క్రైస్తవంలో

దేవుడు స్త్రీనా? పురుషుడా? అన్న ప్రశ్నకు క్రైస్తవం క్లారిటీ  ఇచ్చింది. క్రైస్తవంలో జెహోవా, పరిశుద్దాత్మ, యేసుక్రీస్తు దేవుడి రూపాలు. తన లాంటి రూపంతోనే ఆడమ్ ను దేవుడు సృష్టించాడని బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంది. దాని ప్రకారం దేవుడు పురుషుడు. దీంతో పాటు దేవుడి ప్రతిరూపమే యేసుక్రీస్తని కూడా బైబిల్ చెప్పింది. ఈ లెక్కన చూసుకుంటే భగవంతుడు పురుషుడే. దేవుడి జెండర్ పై జీసెస్ కూడా క్లారిటీ ఇచ్చాడు. దేవున్ని తండ్రిగా క్రీస్తు చెప్పుకున్నాడు. ఆయనే తన రక్షకుడన్నాడు.పురుష లింగ పదాలతోనే పిలిచాడు. కొలిచాడు. అయితే పరిశుద్ధాత్మ జెండర్ గురించే క్రైస్తవంలో కొంత చర్చ నడిచింది.

బైబిల్ పాత నిబంధన లో పరిశుద్ధాత్మ ను స్త్రీలింగ పదం రూహాఖ్ తో పిలిచారు. హిబ్రూ భాషలో రూహాఖ్ స్త్రీ లింగ పదం. క్రైస్తవంలోని మూడు దేవుడి రూపాల్లో ఒకరు మహిళ అని పాతతరం క్రైస్తవులు నమ్మారు. అయితే కొత్తతరం క్రిస్టియన్లు మాత్రం పరిశుద్దాత్మ దేవుడు శక్తి అని నమ్మారు. హోలీ స్పిరిట్ కూడా పురుషుడే అన్నారు. ఈ లెక్కన చూస్తే క్రిస్టియానిటిలో దేవుడు పురుషుడే.

ఇస్లాంలో…

దేవుడి జెండర్ పై ఇస్లాంలో స్పష్టమైన సమాధానం ఉంది. రంగు,రూపం లేని లింగరహితుడు దేవుడు అని ముస్లీంలు నమ్ముతారు. అయితే పవిత్రగ్రంథం ఖురాన్ లో మాత్రం అల్లాహ్ పరిచయం, ప్రస్తావన మొత్తం పురుషలింగ పదాలతోనే ఉంటుంది. ఇంతేకాదు అల్లాహ్ అంటే ఎవరైనే ప్రశ్నకు వచ్చే సమాధానంలోనే ఆయన జెండర్ గురించి తెలిసిపోతుంది. “ఎవరైతే సమస్తాన్ని సృష్టిస్తున్నారో, ఎవరైతే సమస్తాన్ని పోషిస్తున్నారో, ఎవరైతే సమస్తానికి మరణాన్ని ఇస్తున్నారో, ఎవరైతే సమస్త జీవులను ప్రశ్నిస్తాడో ఆయన్నే అరబ్బి భాషలో అల్లాహ్ అని పిలుస్తారు” అని ఇస్లాం చెపుతుంది. దీంతో పాటు అల్లాహ్ గురించి చెప్పడానికి ఖురాన్ లో ఉన్న 99 నామవాచకాలు పురుషలింగ పదాలే..అంటే  ఇస్లాం ప్రకారం కూడా దేవుడు పురుషుడే.

హిందూ ధర్మంలో..

SONY DSC

దేవుడు పురుషుడే అని హిందూ ధర్మం చెపుతుంది.  పురాణాలు, వేదాల్లో భగవంతుడి ప్రస్తావన పురుషుడిగానే ఉంటుంది. రుగ్వేదంలో ఇంద్రుడితో పాటు మిగతా దేవుతల గురించిఉంటుంది. వాళ్లంతా పురుషులే. ఇక విష్ణు పురాణం,  శివపురాణంలోనూ దేవుడు మగవాడిగానే ఉన్నాడు. సృష్టికారకుడు ఎవరన్నదానిపై భిన్నాభిప్రాయం ఉన్నా ఆ ఒక్కడు మాత్రం పురుషుడు అన్నదానిపై స్పష్టత ఉంది. అంటే హిందూ ధర్మం ప్రకారం కూడా దేవుడు మగవాడే..

మతం ముసుగు లేనప్పుడు

ప్రపంచంలోని మెజార్టీ మతాలన్నీ పురుషులు  స్థాపించినవే. అందుకే దేవుడి జెండర్ గురించి ఆయా మతాలు చెప్పిన మాటల్లో నిజం ఉంటుందా? మనిషిని మతం మత్తు కమ్ముకోకముందు దేవుడే ఎలా ఉండేవాడు? రాతియుగంలో మనిషి మొక్కిన దేవుడు పురుషుడా? స్త్రీనా?. ఈ ప్రశ్నకు టర్కీలోని గొబెక్లీటెపేలో సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే రాతియుగం ముగిసి, నియోలిథిక్ జమానా మొదలయ్యే టైంలో ఆఫ్రికా నుంచి వలస వచ్చిన మన పూర్వికులు అక్కడే నివసించారు. 12 వేల సంవత్సరాల క్రితం ఈ భూమ్మీద మతం అన్న ముచ్చటే వినిపించకముందు మనిషి అక్కడో మందిరాన్ని కట్టుకున్నాడు.  1994లో జర్మన్ పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ ఆ కట్డడం అతి పురాతనమైనది. అప్పటీకి ఎలాంటి పనిముట్లను వాడడం ఇంకా నేర్చుకుని మనిషి ఆ మందిరాన్ని కట్టడమే వింత అనుకుంటే, అందులో బొమ్మలు గీయడం మరో వింత.

రాతిమందిరంలో రహస్యం

గొబెక్లీటెపేలోని మందిరంలో ఉన్న రాతిఫలకం దేవుడి జెండర్ కు పర్ ఫెక్ట్ సమాధానం చెపుతుంది. ఓ బిడ్డకు జన్మనిస్తున్న స్త్రీ రూపాన్నే నాటి మనుషులు రాతిఫలకం మీద గీసి పూజించారు. ఓ జీవికి జన్మనివ్వడాన్ని ఆనాటి మనుషులు అతీతశక్తిలా భావించారు. స్త్రీలోనే ఆ దైవత్వం ఉందని ఆమెను పూజించారు. సూటిగా చెప్పాలంటే మన పూర్వీకుల దృష్టిలో దేవుడు స్త్రీ.  

మిలాట్ విప్పిన మర్మం

గొబెక్లీటేపెలోనే కాదు టర్కీలోని చటల్ హోయాక్ లోనూ దేవుడి జెండర్ పై క్లారిటీ దొరకుతుంది. ప్రపంచంలోని పురాతన పట్టణం అయిన చటల్ హోయాక్ లో1958లో ఇంగ్లీష్ ఆర్కియాలజిస్ట్ జేమ్స్ మిలాట్ జరిపిన తవ్వకాల్లో  దొరికిన ఓ విగ్రహం, దేవుడు స్త్రీ అనే నమ్మకాన్ని బలపరుస్తుంది. అటూ ఇటూ రెండు సింహాలు ఉన్న సింహాసనంపై కూర్చున్న మహిళ విగ్రహాన్ని అక్కడి మనుషులు పూజించారని మిలాట్ తేల్చాడు. ఇందుకు శాస్త్రీయ ఆధారాలను చూపించాడు.

దేవి భాగవతం ఏ చెపుతుంది?

మహిళను శక్తి స్వరూపిణిగా పూజించే మనదేశంలోనూ దేవుడి జెండర్ పై కొన్ని నమ్మకాలున్నాయి. దేవుడు మగాడే అన్న విష్ణు, శివ పురాణ వాదనలను దేవీ భాగవతం ఒప్పుకోదు.. ఆ పురాణం ప్రకారం సృష్టికి స్త్రీనే మూలం. విశాల విశ్వం పుట్టకముందే ఆవిర్భవించిన ఓ దివ్య తేజస్సు స్త్రీ రూపంలోకి మారింది. ఆదిశక్తి నుంచే  విష్ణువు, శివుడు, బ్రహ్మ పుట్టారు. ఆ తర్వాతే అండ పిండ బ్రహ్మాండం పురుడు పోసుకుంది. దేవి భాగవతం కూడా దేవుడు స్త్రీ అనే చెపుతుంది.

మరి దేవుడు మగవాడు ఎప్పుడయ్యాడు?

టర్కీలో దొరికిన ఆధారాలు, మన దేశంలోని నమ్మకాల ప్రకారం చూస్తే దేవుడు స్త్రీనే. నియోలిథిక్ కాలం నుంచి దేవీభాగవతం రాసే కాలం వరకోలేకుంటే అది రాసిన వ్యాసమహర్షి కాలం నాటికి దేవుడంటే మహిళ రూపమే. మన పూర్వీకులు మొదట పూజించింది, మొక్కింది స్త్రీ రూపానికే. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మరి భగవంతుడు పురుషుడు ఎప్పుడయ్యాడు? ఎందుకయ్యాడు? ఈ ప్రశ్నకు  దేవి భాగవతమే  తిరుగులేని సమాధానం.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రాణం పోసిన ఆదిశక్తి వాళ్లలో ఒకరితో సృష్టి మొదలుపెట్టాలనుకుంది. కాని వెయ్యి చేతులు, భగభగమండే అగ్నిగోళాల్లాంటి మూడు కళ్లు, త్రిశూలం, శంఖుచక్రాలతో ఉన్న ఆమెను చూసి బ్రహ్మ, విష్ణువులు భయపడ్డారు. కాని పరమేశ్వరుడు ముందుకొచ్చాడు. షరతులు పెట్టాడు. మూడోకన్నుతో పాటు త్రిశూలాన్ని ఇవ్వాలన్నాడు. శివుడి షరతులకు ఒప్పుకున్న ఆదిశక్తి అలానే చేసింది. మూడోకన్ను రావడంతోనే ఆదిశక్తిని శివుడు భస్మం చేశాడు. భస్మాన్నే మూడు భాగాలుగా చేసి లక్ష్మీ, పార్వతి, సరస్వతిగా బ్రహ్మ ప్రాణం పోశాడు. అప్పటి నుంచి హిందూ పురాణాల్లో దేవుడి రూపం మారింది. ఆదిశక్తి ప్రాముఖ్యత తగ్గి, త్రిమూర్తుల పరపతి పెరిగిందంటారు కొందరు.

గాయబ్ అయిన గాయా

స్త్రీ రూపం నుంచి భగవంతుడు పురుషుడిగా మారడంపై గ్రీకు పురాణాల్లో కూడా సమాచారముంది. గ్రీకుల నమ్మకం ప్రకారం విశ్వాన్ని గాయా అనే దేవత సృష్టించింది. మొదట స్వర్గాన్ని, దేవుళ్లు, దేవతలను ఆ తరువాత భూమి, పర్వతాలు, సముద్రాలకు రూపాన్నిచ్చింది. కానీ ఒక తరం తరువాత ఎవరు గొప్ప అన్నదానిపై దేవతలు, దేవుళ్ల మధ్య గొడవలు జరిగాయి. పదిసంవత్సరాల పాటు జరిగిన ఆ యుద్ధంలో గాయా మనుమడు జియోస్ గెలిచాడు. దేవుళ్లకు రాజయ్యాడు. అప్పటి నుంచే గాయా తెరమరుగైందని గ్రీకు పురాణాలు చెపుతాయి. అలా దేవుడు స్త్రీ అనే భావన మెల్లగా రూపం మార్చుకుని పురుషుడిగా మారింది.

గ్రీకు నమ్మకాలనే ఫాలో అయ్యే రోమన్ల పురాణాల్లోనూ దేవుడంటే స్త్రీనే. వారి విశ్వాసాల ప్రకారం సృష్టికి మూలం కిబ్లే అనే దేవత. ఆమెను మాగ్నామార్టా అని కూడా అంటారు. జూలియస్ సీజర్ తో పాటు అగస్టస్,  కిబ్లేను శక్తి స్వరూపిణిగా కొలిచారు. ఆమె తోడుంటే విజయం తమదే అనుకున్నారు. కానీ రోమ్ సామ్రాజ్య పతనం, క్రిస్టియానిటి తెరపైకి వచ్చాక కిబ్లే జ్ఞాపకాలు మరుగున పడ్డాయి. దేవుడొక్కడే వాడు పురుషుడే  అన్న విశ్వాసం ప్రపంచమంతా విస్తరించింది.

నమ్మకమా? నిజమా?

ఇవన్నీ నమ్మకాలు. ఇప్పుడు నిజాలు చెప్పుకుందాం.  మనిషి జీవన ప్రయాణంలోని ఓ కీలక పరిణామమే దేవుడనే నమ్మకం పురుషుడు కావడానికి కారణమైంది. పతనమైన మాతృస్వామ్య వ్యవస్థే ఇందుకు సాక్ష్యం. ఆదిమ కాలంలో స్త్రీ కేంద్రంగానే కుటుంబ పాలన సాగింది. దానికి తగ్గట్టుగానే ఆనాటి సమాజం ఉండేది. అందుకే అప్పుడు దేవుడు మహిళగా ఉన్నాడు. కానీ మాతృస్వామ్య వ్యవస్థ పతనమైన పితృస్వామ్య వ్యవ్యస్థ మొదలైనంక స్త్రీ నుంచి కుటుంబ ఆధిపత్యాన్ని మగవాడు గుంజుకున్నాడు. నమ్మకాల రూపాన్ని మార్చాడు. అప్పటిదాకా ఉన్న దేవుడిని పురుషుడు చేశాడు. పురాణాలను, మతాలను ఇందుకోసం వాడుకున్నాడు.

దేవుడనే భావన నమ్మకమే కావచ్చు. కానీ ఆ విశ్వాసం కోట్లాది జీవితాలను ప్రభావితం చేస్తోంది. అందుకే దేవుడు పురుషుడు అయితే ఏంటీ? స్త్రీ అయితే ఏంటీ? అని సింపుల్ గా తీసిపారేయవద్దు. ఆదిమానవుడు పూజించిన దేవుడు స్త్రీ రూపం నుంచి పురుషుడిగా మారిన పరిణామమే ఇప్పటి మహిళల దుస్థితికి కారణం. మగవాడి రూపంలో ఉన్న దేవుడిని చూపించి పురుషుడు  ఏం చేసినా ఆడది ఎదురుచెప్పకూడదన్న రాజధర్మాన్ని  రాక్షసంగా అమలుచేశారు. ఆడ,మగ సమానం కాదనడానికి పురాణాలను సాక్ష్యంగా చూపించాడు.

ఒకవేళ దేవుడు స్త్రీగానే ఉండి ఉంటే ఇప్పటి మహిళల జీవితాలు ఎలా ఉండేవి? ఈ ప్రశ్నకు పురుషుడిగా మారిన దేవుడు సమాధానం చెప్పకపోవచ్చు. కాని చీకట్లో నుంచి వినిపించే ఓ స్త్రీ స్వరం మాత్రం “కచ్చితంగా ఇలా ఉండకపోయేవని చెపుతుంది”