దేవతా విగ్రహాల ధ్వంసం.. తూర్పుగోదావరిలో దుశ్చర్య - MicTv.in - Telugu News
mictv telugu

దేవతా విగ్రహాల ధ్వంసం.. తూర్పుగోదావరిలో దుశ్చర్య

January 21, 2020

gdbnhn

తూర్పుగోదావరి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. దేవతా విగ్రహాలు, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. పుఠాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కోర్టుకు వెళ్లే దారిలో ఉన్న పలు దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసి, ఫ్లెక్సీలను చించేశారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయిబాబా, దుర్గామాత, వినాయకుడు దుర్గామాత విగ్రహాలను ధ్వంసం చేశారు. 

కలహాలు సృష్టించేందుకే దుండగులు ఈ చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అల్లరి మూకలను గుర్తించి చర్యలు తీసుకోవాలని భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీని పరిశీలిస్తున్నారు.  విగ్రహాల ధ్వంసంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని కోరారు. నిందితులను వెంటనే గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

కాగా గతంలోనూ ఇటువంటి ఘటనలు తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఓ గోడౌన్‌లో తయారు చేసిన దుర్గాదేవి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇలాంటి వరుస ఘటనలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.