గోదారోళ్ల కితకితలు’ ఫేస్‌బుక్‌ పేజీ అడ్మిన్ ఈవీవీ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

గోదారోళ్ల కితకితలు’ ఫేస్‌బుక్‌ పేజీ అడ్మిన్ ఈవీవీ మృతి

June 3, 2022

‘గోదారోళ్ల కితకితలు’ పేరుతో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ క్రియేట్ చేసి లక్షలాది మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఈదల వీర వెంకట సత్యనారాయణ (ఈవీవీ) గుండెపోటుతో మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లాలోని స్వస్థలం బొమ్మూరులో ఆయన చనిపోయారు. గురువారం రాత్రి 11.30 సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ఈవీవీ మృతిపట్ల ప్రముఖులు, గ్రూప్‌ సభ్యులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

మంచితనానికి మారుపేరుగా, ఆపదలో ఆదుకునే వ్యక్తిగా పేరుగాంచిన ఈవీవీ.. గోదావరి జిల్లాల యాస, సంస్కృతి, సంప్రదాయాలు నేటితరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ‘గోదారోళ్ల కితకితలు’ గ్రూప్ను ఆయన 2015లో ప్రారంభించారు. 2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న ఈ గ్రూప్ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ప్రతీ సంవత్సరం కార్తికమాసంలో ఈవీవీ నేతృత్వంలో ‘గోదారోళ్ల కితకితలు’ గ్రూపు సభ్యులు వనసమారాధన జరిపేవారు. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది గ్రూప్ సభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సందడి ఇందులో పాల్గొనేవారు. గోదారోళ్ల కితకితలు గ్రూప్ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం పలు రికార్డులు కూడా సాధించింది. కోకాకోలా కంపెనీలో ఉద్యోగం చేసే ఈవీవీ… ఇటీవల నాగార్జున నటించిన బంగర్రాజు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. ఈవీవీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహం జరిపించారు. ఈవీవీ మృతిచెందారన్న వార్త తెలిసి ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.