5మృతదేహాలు లభ్యం.. కడచూపుకై 38 రోజులుగా..  - MicTv.in - Telugu News
mictv telugu

5మృతదేహాలు లభ్యం.. కడచూపుకై 38 రోజులుగా.. 

October 22, 2019

Godavari Boat .

సరదాగా విహారయాత్రకు వెళ్తూ కుటుంబ సభ్యులకు టాటా బైబై చెప్పి వెళ్ళారు. అవే వారి చివరిమాటలు అయ్యాయి. పాపం అప్పుడు కుటుంబ సభ్యులకు తెలియదు.. అవే వారి చివరి పలకరింపులు అని. మృత్యువు ఒక్కసారిగా అందరినీ కట్టగట్టుకుపోయినట్టు తీసుకుపోయింది. ఎంత ఘోరం.. ఎంత దారుణం. తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు వద్ద సెప్టెంబర్ 15న పర్యాటకులతో పాపికొండలు వెళ్తున్న రాయల్ వశిష్ఠ బోటు మునిగిన విషయం తెలిసిందే. బోటు మునిగినప్పడు అందులో 75 మంది వుండగా, 26 మందిని ప్రయాణికులను కాపాడారు. 

మరో 51 మంది నదిలో గల్లంతయ్యారు. వారిలో 11 మంది మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగిలినవారు బోటుతో సహా నది అడుగుకు వెళ్లిపోయారని అధికారులు భావించారు. తమవారు ఎలాగో చచ్చిపోయారు.. కనీసం వారిని చివరిసారిగా చూసుకునే భాగ్యాన్ని అయినా కల్పించమని మృతుల బంధువులు అధికారులను వేడుకున్నారు. 38 రోజులుగా తమవారి మృతదేహం లభిస్తుందేమోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ నెలన్నర నుంచి వారికి కంటిమీద కునుకు లేదు. కడుపుకు తినకుండా ప్రతిరోజూ కన్నీరు కార్చుతూనే వున్నారు. 

ఎట్టకేలకు అన్ని రోజుల ఉత్కంఠకు తెరపడింది. ధర్మాడి సత్యం బృందం బోటు వెలికితీతకు పూనుకుంది. సెప్టెంబర్ 30 నుంచి బరిలోకి దిగారు. అయితే వర్షాలు తీవ్ర ఆటంకం కలిగించడంతో   అప్పుడు ఐదు రోజులు శ్రమించారు. మళ్లీ వారం రోజులుగా ధర్మాడి సత్యం బృదం రంగంలోకి దిగి తీవ్రంగా శ్రమిస్తోంది. బోటు మునిగి చాలా రోజులు అవడంతో బోటు శకలాలుగా మారిందని చెప్పారు. కాకినాడ పోర్ట్ అధికారుల పర్యవేక్షణలో బోటు వెలికితీత పనులు జరుగుతున్నాయి. నిన్న తలలేని ఓ మొండెం లభించింది.

ఈ క్రమంలో రెండు విడతల్లో ధర్మాడి టీం బాగా శ్రమించింది. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేశారు. ఎట్టకేలకు బోటును నది అడుగునుంచి ఒడ్డుకు లాక్కొచ్చారు. బోటులో ఐదు మృతదేహాలను గుర్తించామని అధికారులు వెల్లడించారు. అయితే అవి పూర్తిగా కుళ్ళిపోయాయని.. అవి ఎవరి మృతదేహాలో గుర్తించడం కష్టంగా మారిందని అన్నారు. మృతదేహాలను మార్చురీకి తరలించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి అనంతరం వారి వారి బంధువులకు అప్పజెప్తామని అన్నారు. వరంగల్‌కు సంబంధించినవారు ఉన్నారని భావిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు తమవారికోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తమవారిని కడచూపుకు కూడా నోచుకోలేమా అని కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమవారి ఏ ఒక్క శరీరభాగమైనా కడసారి చూసుకుంటాం అని వారు కన్నీరు పెట్టడం పలువురని కలిచివేసింది.