గోదావరి ఘోరం.. 8 మృతదేహాల్లో 2 గుర్తించి బంధువులకు అప్పగింత.. - MicTv.in - Telugu News
mictv telugu

గోదావరి ఘోరం.. 8 మృతదేహాల్లో 2 గుర్తించి బంధువులకు అప్పగింత..

October 23, 2019

Godavari Boat  .

38 రోజుల తర్వాత తూర్పు గోదావరి కచ్చలూరు వద్ద మునిగిన రాయల్ వశిష్ఠ బోటును ఎట్టకేలకు ధర్మాడి సత్యం బృందం నిన్న బయటకు తీసిన విషయం తెలిసిందే. దీంతో మృతుల కుటుంబ సభ్యులు తమవారి మృతదేహాల కోసం అక్కడికి వస్తున్నారు. వారి ఆఖరిచూపు కోసం ఎదురుచూస్తున్నామని కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే నిన్న బోటును వెలికి తీసిన తర్వాత అందులో 8 మృతదేహాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. ఒంటిపై దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా గుర్తిస్తున్నారు. గుర్తు పట్టరాని విధంగా ఉన్న మృతదేహాలను డీఎన్ఏ పరీక్ష చేసి వారివారికి అప్పజెప్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే రెండు మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించారు.

ఆధార్ కార్డు ఆధారంగా ఒక మృతదేహం వరంగల్‌కు చెందిన కొమ్ముల రవిదిగా గుర్తించారు. మరొక మృతదేహం రాయల్ వశిష్ట బోటు డ్రైవర్ కాకినాడకు చెందిన సంగాడి నూకరాజుగా తేల్చారు. ఇంకా ఆరు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఆస్పత్రి వద్ద గర్తు పట్టలేనివిధంగా కుళ్లిపోయిన తమవారి మృతదేహాలను చూసి బంధువులు రోధిస్తున్నారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో విషాధం నెలకొంది. 38 రోజులు బోటు నీళ్లలోనే ఉండిపోవడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయాయని వైద్యులు వెల్లడించారు.