భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తోన్న వర్షాలతో గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. శ్రీరామ్ సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి భారీ మొత్తంలో వరద కిందకు వస్తోంది.
ఫలితంగా భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరిలో ప్రస్తుతం సుమారు 14 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. ఒక్క రోజులోనే గోదావరి వరద 33 అడుగుల నుంచి 53 అడుగులకు చేరడం గమనార్హం. గోదావరి నీటిమట్టం పెరగడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చర్ల మండలం తాళిపేరు ప్రాజెక్టులో 22 గేట్లు ఎత్తి 52,685 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.