Godavari reaches 51 feet at Bhadrachalam
mictv telugu

భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం.. నిలిచిపోయిన రాకపోకలు

September 13, 2022

ఎగువన కురస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో వరద భారీగా పెరుగగా, మంగళవారం ఉదయం 8 గంటల వరకు 50.2 అడుగులు, మధ్యాహ్నానికి 50.9 అడుగులకు చేరింది. వరద ప్రవాహంతో ఇప్పటికే రెండు ప్రమాద హెచ్చరికలు అమల్లో ఉండగా, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇప్పటికే స్నాన ఘట్టాలు మునిగిపోయాయి. కల్యాణ కట్ట కిందవైపు నీరు చేరింది. అటు భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు భద్రాచలం నుంచి ఆంధ్రాలోని కూనవరం, చింతూరు విఆర్ పురం మండలాలకు కూడా రాకపోకలు నిలిచిపోగా, అధికారులు బస్సు సర్వీసులను ఆపివేశారు. ఈ నేపథ్యంలో వరద ముప్పు పొంచి ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అధికార యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. గజ ఈతగాళ్లు, లాంచీలు, బోట్లను సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. ఎలాంటి ప్రమాదం వాటిల్లినా సమాచారం అందిస్తే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు చేపడతాయని భరోసా ఇచ్చారు.