దుర్గామాతకు బుర్ఖా... బెంగాల్‌లో రచ్చరచ్చ - MicTv.in - Telugu News
mictv telugu

దుర్గామాతకు బుర్ఖా… బెంగాల్‌లో రచ్చరచ్చ

September 16, 2021

దుర్గా నవరాత్రులు సమీపిస్తున్న సమయంలో ఓ దుర్గమ్మ బొమ్మపై చిత్రంపై బెంగాల్‌లో అలజడి చెలరేగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆర్టిస్ట్ సనాతన్ దిండా ‘మా ఆశ్చె(అమ్మ వస్తోంది)’ అనే క్యాప్షన్‌తో బురఖాలో దుర్గాదేవిని చిత్రించడంతో వివాదం రాజుకుంది. మాతకు బురఖా వేయడమేంటని, ఆమెకు బురఖాకు ఏం సంబంధమని బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కేయా ఘోష్ ప్రశ్నించారు.

మెజారిటీ బెంగాలీ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దేవతను బురఖాలో చిత్రించి హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్ధ్యేశంతో ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నాడని దిండాపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై దిండా స్పందిస్తూ.. ఆ చిత్రంలో ఉన్న ‘స్త్రీ’ని దుర్గా మాత అనే ఎందుకు అనుకోవాలి? నా వరకైతే ఆమె ఒక మహిళ మాత్రమే. నేను ఎక్కడా బురఖా లేదా హిజాబ్ అని రాయలేదు. ఈ పురుషాధిక్య సమాజం నుంచి తన సౌందర్యాన్ని కాపాడుకుంటున్న మహిళగా చిత్రించాను. కావాలనే కొందరు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు’ అని అన్నాడు. ‘నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అణచివేతను, వివక్షను ఉద్దేశించి గీసిన చిత్రం ఇది. ఆఫ్ఘనిస్థాన్‌లోనే చూడండి. అక్కడ మహిళల పరిస్థితి స్వేచ్ఛా ,సమానత్వం లేకుండా ఎంత దారుణంగా తయారవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అందువల్ల ఈ ఫొటో మత, ప్రాంత సరిహద్దులకు అతీతమైనది’ సనాతన్ దిండా చెప్పాడు. మీ సంకుచిత ఆలోచనల పరిధి నుండి బయటకు వచ్చి ఆ చిత్రాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు స్త్రీలు అనుభవిస్తున్న బాధ,వివక్ష,అణచివేత మీ గుండెలను తడుముతుంది అని వివరించాడు.

అంతేకాదు బురఖా ఉంటే తప్పేంటి అని కూడా అతడు ఎదురు ప్రశ్నించాడు. ‘బురఖాను ఓ సానుకూలాంశంగా పరిగణిస్తాను, ధిక్కార పతాకంగా భావిస్తాను, నిజానికి అది ఒక సాధికారత. మృగాల్లాంటి పురుషుల చూపుల నుంచి స్త్రీలను అది రక్షిస్తుంది’ దిండా అన్నాడు. ఇందులో ఎలాంటి తప్పు లేకపోయినా.. తనపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ చిత్రాన్ని తొలగించేలా చేశారని, బలవంతంగా క్షమాపణ చెప్పించారని దిండా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తన కూతురిని రేప్ చేస్తామని కూడా కొందరు బెదిరించినట్లు వాపోయాడు. చరిత్ర తెలియని నిరక్ష్యరాస్యులు, మతం, ఆధునిక కళ గురించి తెలియని వాళ్లు, విశాల దృక్పథం , సరియైన ఆలోచన విధానం లేని వాళ్ళే ఈ అంశాన్ని చిలువలు పలువలు చేశారని ఆయన మండిపడ్డాడు.