మహమ్మారిపై మారియమ్మన్ దేవత ఫైట్..  - MicTv.in - Telugu News
mictv telugu

మహమ్మారిపై మారియమ్మన్ దేవత ఫైట్.. 

July 9, 2020

కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో పరిస్థితి దారుణంగా తయారైంది. అయినా కూడా చాలా మంది ప్రజలు మాస్కులు లేకుండా తిరిగేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ఎవరూ నిబంధనలు పాటించడం లేదు. దీన్ని గుర్తించిన పోలీసులు వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ఏకంగా మారియమ్మన్ దేవతను రంగంలోకి దింపారు. ఆమె చేత మాస్కులను పంపిణీ చేయిస్తూ.. వైరస్ తీవ్రత గురించి హెచ్చరికలు చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మారియమ్మన్ దేవతను పూజిస్తారు. ఏవైనా వ్యాధులు వచ్చినా.. అనారోగ్యంగా ఉన్నా నయం చేయాలంటూ ఆమెను పూజించడం ఆచారంగా వస్తోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించాలంటే ఆమె అయితేనే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రధించారు. కరోనా హాట్ స్పాట్ ప్రాంతాల్లో మారియమ్మన్ అవతారంలో ఉన్న మహిళ మాస్కులు పెట్టుకోనివారి దగ్గరకు వెళ్లి పంపిణీ చేసింది. వైరస్‌ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా సూచించింది. కాగా గ్రామీణ ఏరియాల్లోని సుమారు 30 శాతం మంది ప్రజలు మాస్కులు ధరించడం లేదని ఇటీవల తేలింది. దీంతో చాలా ప్రాంతాల్లో యమ ధర్మరాజు, కరోనా వేషధారణలో కూడా ప్రజలకు అవగాహన కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తమిళనాడులో దాదాపు 1,22,350 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1700 మంది చనిపోయారు.