Godfather Writer Lakshmi Bhoopal Sensational Comments On KA Paul
mictv telugu

కేఏ పాల్ పై గాడ్ ఫాదర్ రైటర్ సంచలన వ్యాఖ్యలు

November 12, 2022

ఇప్పుడంటే కొన్ని మీడియా సంస్థలు కేఏ పాల్ ని కామెడీ పీస్ చేశాయి కానీ ఒకప్పుడు ఆయనంటే దేశవిదేశాల్లో క్రేజ్ ఉండేది. విశాఖలో ఎక్కడో చిన్న పల్లెటూరిలో పుట్టి.. విదేశాలకి ప్రత్యేక విమానంలో వెళ్లే స్థాయికి ఎదిగిన పాల్ లైఫ్ స్టోరీ అందరికి ఆదర్శం అనే వారు ఉంటారు. నేటితరానికి కామెడీ పీస్ అయినా.. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కి గొర్రెల్లా కొందరు నవ్వుకున్నా.. ఆయనొక లెజెండ్ అంటారు. క్రైస్తవ మతబోధకుడిగా వందల కొద్దీ దేశాల్లో తిరిగేవాడని, ప్రపంచ శాంతి కోసం పాల్ చేసిన కృషి అనిర్వచనీయమని, అపర కుబేరులు సైతం పాల్ వస్తే లేచి నిలపడాల్సిందేనని, పెద్దన్న అని చెప్పుకునే అమెరికా అధ్యక్షులు సైతం పాల్ అడుగుతే క్షణాల్లో అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందేనాని, సొంతంగా చార్టెడ్ విమానం కలిగిన ఏకైక మతబోధకుడిగా పాల్ రికార్డు సృష్టించారుని అంటారు. ధనిక దేశాల్లో నిధులు సేకరించి ఆఫ్రికన్ పేద ప్రజలకు సహాయం చేసిన ఏకైక వ్యక్తి పాల్ ఒక్కరే.. అలాంటి పాల్ కొందరి రాజకీయాలకు బలై సామాన్యుడిగా తెలుగు రాష్ట్రాల్లో ఉండిపోవాల్సి రావటం విచారకరమని ఆయన అభిమానులు వాపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చిత్రాన్ని గీసి.. కేఏ పాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు గాడ్ ఫాదర్ రచయిత లక్ష్మీ భూపాల .

కేఏ పాల్‌‌ని ఎగతాళి చేసే మీడియా, సోషల్ మీడియా పండితులపై ఆయన లక్ష్మీ భూపాల విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘నేను చిన్నప్పటి నుండి చూసిన అత్యంత శక్తివంతమైన క్రైస్తవ ఎవంజెలిస్ట్, శాంతి బోధకుడు, ఒకప్పటి కుబేరుడు కెఏ పాల్ గారి బొమ్మ నా కుంచెతో గీయడం గౌరవంగా భావిస్తున్నా. నేను నిక్కర్లేసుకుని రంగు డబ్బా పట్టుకున్న రోజుల్లోనే పాల్ గారి సభలకు బొమ్మలేసి, బ్యానర్లు రాసినోడ్ని కాబట్టి, ఆయన్ని గత ముప్పై ఏళ్ల ముందునుంచి తెలిసినోడ్ని కాబట్టి ఇప్పుడు ఈ బొమ్మ గీసాను. ఈ మధ్య ఆయన్ని కేవలం కామెడీ పీస్‌గా భావించి ట్రోల్స్ చేస్తున్న చాలామంది ఈ తరం అవగాహనలేని సోషల్ మీడియా, న్యూస్ మీడియా సగం జ్ఞాన పండితుల్ని చూసి జాలేసి ఈ బొమ్మ గీస్తున్నా. ఇప్పటి సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే పిల్ల నిబ్బా నిబ్బీలకు అంకితం చేస్తున్నా. ఆయన టీవీ ఇంటర్వ్యూలలో చెప్పే ఆయన గతం నూటికి నూరుశాతం నిజం. ఇప్పుడిలా ఎందుకయ్యారో ఏమిటో అనే చర్చ నాకు అనవసరం. పాల్ గారి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇంటర్నెట్‌లో చూడండి’’ అని లక్ష్మీ భూపాల పేర్కొన్నారు.