దేవుడి కాళ్లు మొక్కి  చోరీ.. మరో ఆలయంలో ఇంకో ఘోరం - MicTv.in - Telugu News
mictv telugu

దేవుడి కాళ్లు మొక్కి  చోరీ.. మరో ఆలయంలో ఇంకో ఘోరం

September 21, 2020

God's legs planted and stolen .. Another incident in another temple.

దొంగలకు దేవుడు భక్తి అన్నవి ఏవీ పట్టింపు లేకుండా పోతున్నాయి. దోచుకోవడంలో వారికి మనుషులతో దేవుళ్లు కూడా సమానమే అయిపోయారు. అర్థరాత్రి పూట అందరూ నిద్రలో ఉండగా వచ్చి దేవుడి కాళ్లకు మొక్కి ఆయన హుండీలోని డబ్బులను దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నిన్న అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. ముగ్గురు యువకులు బైక్ మీద వచ్చారు. ఇద్దరు బైక్ మీద ఉండగా ఒకడు దిగి ముందుగా అక్కడ ఎవరైనా ఉన్నారా అని చెక్ చేశాడు. అనంతరం ఇంకొకడు తోడుగా వచ్చాడు. ఇద్దరూ కలిసి ఆంజనేయస్వామి విగ్రహం కాళ్లకు మొక్కారు. అనంతరం అక్కడున్న హుండీని బద్దలు కొట్టారు. అందులోని సొమ్మును దోచుకుపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ వీడియో ఫుటేజీని పరిశీలించారు. ఈ ఫుటేజ్ ఆధారంగా దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. 

శ్రీ భైరవస్వామి ఆలయంలో క్షుద్రపూజలు

మరో ఘటనలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు శ్రీ భైరవస్వామి ఆలయంలో క్షుద్ర పూజలు తీవ్ర కలకలం రేపాయి. పూజలు నిర్వహించాక కాలభైరవ స్వామి అంగాన్ని దుండగులు ధ్వంసం చేసినట్టు గుర్తించారు. గతంలో కూడా ఇలాగే కాలభైరవ స్వామి అంగాన్ని ధ్వంసం చేశారు. అనంతరం అంగ భాగాన్ని దుండగులు కొంత ఎత్తుకెళ్ళారు. ఇప్పుడు మిగిలిన అంగ భాగాన్ని రాయితో కొట్టి తీసుకెళ్లారు. క్షుద్ర పూజల కోసం తీసుకెళ్లి ఉంటారని ఆలయ నిర్వాహకులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం.

కాగా, ఏపీలో హిందూ దేవుళ్ళ విగ్రహాల మీదా, గుడుల మీద వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. అంతర్వేది రధం దగ్ధం ఘటన, బెజవాడ దుర్గమ్మ రథం సింహాల మాయం ఇలా వరుస ఘటనలు చర్చనీయాంశంగా మారాయి.