కోర్టులకెక్కి కరోనా పనికి అడ్డుపడుతున్నారు.. ఈటల - MicTv.in - Telugu News
mictv telugu

కోర్టులకెక్కి కరోనా పనికి అడ్డుపడుతున్నారు.. ఈటల

June 5, 2020

Etela Rajender.

తెలంగాణ రాష్ట్రంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అనవసరంగా కోర్టులకెక్కి కరోనా పనికి అడ్డుపడుతున్నారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి, వృద్ధులకు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న హై రిస్క్ వ్యక్తులకే కరోనా పరీక్షలు చేపడుతున్నట్టు తెలిపారు. అయితే, ఇవేవీ పట్టించుకోని కొన్ని రాజకీయ పక్షాలు తమపై విమర్శలు చేస్తున్నాయని, కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 


వాళ్లకో న్యాయం మాకో న్యాయం అన్నట్టుగా మాట్లాడుతున్నారని, ఈ సమస్యను ఎవరూ రాజకీయ కోణంలో చూడరాదని అన్నారు. ‘కరోనా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉన్న సమస్య. కేంద్రం ప్రకటించిన అన్ని లాక్‌డౌన్ మార్గదర్శకాలను పాటిస్తున్నాం.  ఐసీఎంఆర్ నియమావళిని అనుసరిస్తున్నాం. మేము ఇంత చేస్తున్నాగానీ, కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వాన్ని పనిచేసుకోనివ్వకుండా అడ్డు తగులుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏవైనా సూచనలు, సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలే తప్ప, దుష్ట చర్యలు చేయరాదు. మా పని మేము చేసుకోనివ్వాలి. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కరోనా కేసులు పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు.. వలస కూలీల ద్వారా కేసుల సంఖ్య పెరిగింది. కరోనాను రాజకీయ కోణంలో చూడొద్దు. సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం సరికాదు. వర్షాకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. హైరిస్క్‌ కాంటాక్ట్‌ ఉన్నవారికి తప్పనిసరిగా పరీక్షలు చేస్తాం. జైళ్లలో పరీక్షలు నిర్వహిస్తే 200కు పైగా కేసులు వచ్చాయి’ అని ఈటల రాజేందర్ తెలిపారు.