మద్యం దొరక్క మందుబాబుల్లో కొందరు పిచ్చెక్కి ఆస్పత్రుల పాలవుతుంటే మరికొందరు నేరాలకు తెగబడుతున్నారు. ఏం చేసైనా సరే అని దొంగతనాలతో ‘దాహం’ తీర్చుకుంటున్నారు. దీనికి కొందరి దురాశ కూడా తోడుకావడంతో వైన్ షాపులకు బొక్కలు పడుతున్నాయి. బ్లాక్‌లో మద్యం అమ్ముకోడానికి కొందరు షాపులను కన్నాలు వేస్తున్నారు. వీటి వెనుక షాపుల యజమానుల హస్తం కూడా ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పోలీసు ఆంక్షలతో దుకాణాలు తెరిచే అవకాశం లేకపోవడంతో ‘చోరీ’ల బాట పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లాక్‌డౌన్ వల్ల రోడ్లపై నిఘా లేకపోవడం దుండగులకు వరంగా మారుతోంది. ఏపీ, కర్ణాటక, తెలంగాణతోపాటు చాలా రాష్ట్రాల్లో మద్యదుకాణాల్లో చోరీలు సాగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం న్యూటౌన్ చౌరస్తాలోని గోకుల్ వైన్స్ దొంగలపాలైంది. షాపు వెనకవైపు నుంచి గోడకు పెద్ద రంధ్రం వేసిన దుండుగులు లక్షల ఖరీదైన మద్యాన్ని ఎత్తకెళ్లారు. సీసీ టీవీల్లో దొంగల కదిలికలు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇది ఇంటి దొంగల పనే అయ్యుండొచ్చనని, నల్లబజారు అమ్ముకోడానికి ఇలాంటి నాటకం ఆడి వుంటారని అనుమానిస్తున్నారు.