గోల్కొండ సందర్శనకు గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అంటే - MicTv.in - Telugu News
mictv telugu

గోల్కొండ సందర్శనకు గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అంటే

July 4, 2020

Golconda Fort Open For Tourist

లాక్‌డౌన్ సడలింపుల తర్వాత దేశంలో పర్యాటక రంగాలు మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఇప్పటికే గోవా లాంటి ప్రదేశాలు తమ ప్రాంతానికి పర్యాటకులకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ పర్యాటక శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రఖ్యాత గోల్కొండ కోట సందర్శనకు పర్యాటకులకు అనుమతి ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో చాలా రోజులుగా మూతపడి ఉన్న ఈ కోట తిరిగి తెరుచుకోనుంది. అయితే ఈ సమయంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తిగా మారింది. 

జులై 6వ తేదీ నుంచి కోటను తెరుస్తామని అధికారులు తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. సందర్శనకు వచ్చే పర్యాటకులు ముందుగానే ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. అయితే దీనికి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. ప్రతి రోజూ కేవలం 2వేల మందికే అవకాశం కల్పించనున్నారు. ఖచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని సూచించారు. కోట ప్రాంతంలో ముందు జాగ్రత్తగా శానిటైజర్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. అయినా కూడా పర్యాటక రంగాలను ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవడం విశేషం.