బంగారు నగల అమ్మకాల్లో మోసాలను అరికట్టడంతో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఇకపై ఆరు అంకెల కోడ్ లేని హాల్‌మాల్క్ నగలను అమ్మకూడదని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. అంకెలు పదాలు కలిసి ఉండే ఆల్ఫాన్యూమరిక్ HUID (Hallmark Unique Identification) హాల్‌మార్క్ చేసిన నగలు, కళాకృతులను మాత్రం అమ్మాల్సి ఉంటుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో శుక్రవారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఎస్ఐ)తో సమావేశమైన తర్వాత ఈమేరకు వెల్లడించింది. బంగారం స్వచ్ఛతకు హాల్‌మార్క్ గుర్తు. దీనిపై BIS లోగోను, ఆరంకెల అల్ఫాన్యూమరిక్ కోడ్‌ను ముద్రించి ఉంటారు. నిజానికి హాల్‌మార్కింగ్ తప్పనిసరి అని కేంద్రం 2021లో స్పష్టం చేసింది. కరోనా వల్ల వ్యాపారాలు దెబ్బతినడం, చిన్నచిన్న స్వర్ణకారుల అభ్యంతరాల వల్ల అది వాయిదాపడుతూ వస్తోంది. ఇప్పుడు అన్నీ కుదుటపడ్డంతో నిషేధాన్ని అమల్లోకి తెలుస్తోంది.