బట్ట తలలో బంగారం..షాకైన అధికారులు - MicTv.in - Telugu News
mictv telugu

బట్ట తలలో బంగారం..షాకైన అధికారులు

April 22, 2022

19

‘మేలిపండు చూడు మేలిమై ఉండు. పొట్ట విప్పి చూడు పురుగులుండు’ అనే సామెతకు ఏమాత్రం తీసిపోని విధంగా ఓ స్మగ్లర్లు.. తన బట్టతలలో బంగారం పెట్టుకోని స్మగ్లింగ్ చేస్తూ, పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సినిమాల్లో చూపించే విధంగానే బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

 

ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో బట్టతలను కవర్ చేస్తూ, పెట్టుకున్న విగ్‌లో బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిని విమానాశ్రయ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అబుదాబి నుంచి వచ్చిన సదరు ప్రయాణికుడిని చూసి ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే కస్టమ్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. అదే సమయంలో సదరు వ్యక్తి తడబడుతూ మాట్లాడడంతో అనుమానం మరింత ఎక్కువైంది.

అనంతరం ప్రయాణికుడు పెట్టుకున్న విగ్ తీసి చూస్తే పేస్టు రూపంలో ఉన్న బంగారం బయటపడింది. దాదాపు 630.45 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 30.55 లక్షలు ఉంటుందని, నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.