సకల వేద స్వరూపిణి బెజవాడ కనకదుర్గమ్మకు ఓ ఎన్నారై భక్తుడు రూ.40 లక్షల విలువైన హారం సమర్పించాడు. దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రీ దేవి రూపంలో దర్శనమిస్తోన్న దుర్గమ్మకు అమెరికా నుంచి వచ్చిన తాతినేని శ్రీనివాస్ ఈ విలువైన హారాన్ని బహూకరించారు. అట్లాంటాలో ఉండే తన కుమారుడి తొలి జీతంతో అమ్మవారికి హారం సమర్పించినట్లు శ్రీనివాస్ వెల్లడించారు. అమ్మవారికి హారం కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్లు శ్రీనివాస్ తొలుత ఆలయ అధికారులను సంప్రదించారు. దీంతో వారు కనకపుష్యరాగం హారం చేయించి ఇవ్వాలని చెప్పారు. వారి సూచన మేరకు శ్రీనివాస్ రూ.40 లక్షల రూపాయలతో హారం చేయించి ఇవాళ ఆలయ ఈవో సురేష్‌బాబు, ఇతర అధికారుల సమక్షంలో అందజేశారు.
కనక పుష్యరాగాలన్నీ ఒకే సైజులో ఉండేందుకు సింగపూర్ నుంచి వీటిని తెప్పించానని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘భక్తులు ఎవరైనా అమ్మవారికి ఏడు వారాల నగలు సమర్పించాలనుకుంటే దేవస్ధానంలో సంప్రదించాలి. ఆరు నెలల నుంచి అమ్మవారికి ఏడు వారాల నగలు అలంకరిస్తున్నాం. సోమవారం ముత్యాలు, మంగళవారం పగడాలు, బుధవారం పచ్చలు, గురువారం కనకపుష్యరాగాలు, శుక్రవారం డైమండ్, శనివారం నీలాలు, ఆదివారం కెంపులతో అలంకరిస్తున్నాం’ అని సురేష్ బాబు తెలిపారు.