10 వేలు తగ్గిన బంగారం.. ఇప్పుడు కొంటే లాభమా?  - MicTv.in - Telugu News
mictv telugu

10 వేలు తగ్గిన బంగారం.. ఇప్పుడు కొంటే లాభమా? 

November 30, 2020

goldd

బంగారం ధర భారీగా పడిపోతోంది. నాలుగు నెలల కిందటి ధరతో పోలిస్తే ఏకంగా 10 వేలు తగ్గిపోయింది. 24 కేరట్ల పసిడి ధర ఐదు నెలల కిందట 54 వేల రూపాయలు చేరి గుండెల్లో దడపుట్టించింది. అది తాజాగా నేల చూపులు చూస్తూ 44 వేలకు దిగొచ్చింది. 24 కేరట్ల నాణ్యమైన బంగారం కూడా 60 వేల రూపాయలను నుంచి 48 వేలకు దిగివచ్చింది. 

ధరలు భారీగా పడిపోవడంతో బంగారం కొనడానికి ఇదే సరైన సమయం అని చాలా మంది భావిస్తున్నారు. మరికొందరు మాత్రం ధరలు ఇంకా తగ్గుతాయని, 30 వేలకు వేలకు పడిపోతే అప్పుడు కొనొచ్చని అనుకుంటున్నారు. 

మరి ఇప్పుడు బంగారం కొనొచ్చా? విషయంలోకి వెళ్లే ముందు కరోనా గురించి కొంచెం చెప్పుకుందాం. కరోనా తొలి రోజుల్లో బంగారం ధర భారీగా పడిపోయింది. తర్వాత మళ్లీ పుంజుకుంది. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి భారీగా కొనుగోలు చేశారు. కరోనాకు టీకాలు వచ్చేస్తుండడంతో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారంపై కాకుండా షేర్ మార్కెట్‌పై మొగ్గుచూపుతున్నారు. బంగారం ధరపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని అర్థమవుతుంది. అదే సమయంలో.. దాని పెరుగుదల ఎప్పట్లాగే క్రమంగా పెరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. కరోనా రాకుండా ఉండి ఉండే ధర ఎంత ఉండేదో ప్రస్తుతం అంత ధరే ఉందన్నమాట. 

నిజానికి బంగారం కొనడానికి ఇదే సరైన సమయం అని ఎవరూ చెప్పలేరు. మన అవసరాలను బట్టి, ధరలను బట్టి మనమే నిర్ణయం తీసుకోవాలి. పసిడి ధర కొన్నిసార్లు ఒడిదుడుకులకు గురైనా అది నిత్యం పెరుగుతూనే ఉంటుంది. దీర్ఘకాలంలో అదెప్పుడూ లాభాలే తెచ్చిపెడుతుంది. 

ఉదాహరణకు మనం ఇప్పుడు రెండు తులాలు కొనేశాం అనుకోండి. దాని ధర మరో వెయ్యో రెండు వేలో తగ్గిందని అనుకోండి. అయ్యో అని బాధపడతాం. కానీ రెండు మూడేళ్ల తర్వాత బంగారం ధర కచ్చితంగా పెరుగుతుంది. అప్పుడేమనుకుంటాం? రెండేళ్ల కిందట కొనడమే మేలైందని అని సంతోషిస్తాం. బంగారు ధరల చరిత్ర చెబుతున్న నగ్నసత్యం ఇదే. మనకు బంగారం తక్షణం అవసరమైతే కొనుక్కుని తీరాల్సిందే. లేదంటే కొన్నాళ్లు వేచి చూడాలి. కరోనా వల్ల ప్రజల ఆదాయం పడిపోవడంతో ఇప్పుడు బంగారం కొనే సీన్ కూడా చాలామందికి లేదులెండి.