‘బంగారు లేడి’ పరుగు.. 40 దాటి, ఆల్ టైమ్ రికార్డ్
బంగారం ధరలకు కొత్తకొత్త రెక్కలు పుట్టకొస్తున్నాయి. కొనాలనుకున్నవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారంపై ఎంత ప్రీతి వున్నా కొందరికి కొనలేని పరిస్థితి నెలకొంది.
తులం బంగారం ధర రూ.40,000 మార్క్‌ను దాటి మళ్లీ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.40,220 ధరకు చేరుకుంది. అమాంతం పెరిగిన ధరలతో బంగారం ప్రియులు లబోదిబోమంటున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో 99.9% స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.40,220 కాగా, 99.5% స్వచ్ఛత గల బంగారం ధర రూ.40,050. హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర రూ.40,440 కాగా, 22 క్యారెట్ ధర రూ.37,130. 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.400 పెరిగి రూ.30,200 ధరకు చేరుకుంది.
ఇదిలావుండగా వెండి ధర కూడా చుక్కలను తాకుతోంది. కేజీ వెండి రూ.200 పెరిగింది. కేజీ వెండి ధర రూ.49,050 చేరుకుని రూ.50,000 వైపు సాగుతోంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.49,160. ఇక మార్కెట్‌లో 100 వెండి నాణేల ధర రూ.3,000 ధర పెరిగింది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.1,01,000 కాగా అమ్మకం ధర రూ.1,02,000. కాగా బంగారం, వెండి ధరలు ఈ తరహాలో పెరగడానికి ప్రధాన కారణం డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ పరిస్థితుల కారణమే అంటున్నారు.