రికార్డు ధర చేరుకున్న బంగారం
పసిడి ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని అంటుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.40వేలకు ఎగబాకుతోంది. ఈ క్రమంలో మంగళవారం 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి, రూ.38,770కు చేరుకుంది. ఇదే ఆల్‌టైం రికార్డు స్థాయి ధర కావడం గమనార్హం. బంగారు నగల తయారీదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండడంతో బంగారం ధర అంతకంతకూ పెరుగుతోందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.
మరోపక్క కిలో వెండి ధర రూ.1,100 తగ్గి రూ.43,900లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి బలహీన పడుతుండటం కూడా బంగారం ధర పెరగడానికి కారణమవుతోంది. బంగారం ధర పెరగడంపై మార్కెట్ విశ్లేషకులు స్పందిస్తూ..'అంతర్జాతీయంగా బంగారం ధర స్థిరంగా ఉంది. ఔన్సు 1500 డాలర్ల వరకూ పలుకుతోంది. ఈ వారం చివరిలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ జులై సమావేశ మినిట్స్, జాక్సన్ హోలీ ప్రసంగం ఉన్న నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరతో పోలిస్తే డాలర్ బలంగా ఉంది’ అని చెబుతున్నారు.