బంగారం ఉత్పత్తిలో భారత్ ఎందుకు వెనకబడింది?   - Telugu News - Mic tv
mictv telugu

బంగారం ఉత్పత్తిలో భారత్ ఎందుకు వెనకబడింది?  

August 27, 2019

Gold production in india .

ధగధగ మెరుపుతో కళ్లకు పండుగ చేసే బంగారం ధరలు ఇప్పుడు అదే మెరుపులతో కన్నీళ్ల పెట్టిస్తున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలు ఇక కనకానికి సెలవు చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 10 గ్రాములు మేలిమి బంగారం ధర రూ.40 వేలు దాటడంతో ఆభరణ ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, డాలరు-రూపాయి మారకం విలువలు, దిగుమతి సుంకాలు వంటి వ్యవహారాలను పక్కనబెడితే.. అసలు మనదేశంలోనే ఆ బంగారాన్ని వెలికితీస్తే బాగుటుంది కదా అని కొందరు కోరుకుంటున్నారు. మరి మనదేశంలో బంగారం ఈ సమస్యలకు పరిష్కారాలు చూపుతుందా? అసలు బంగారానికి, భారత్‌కు ఉన్న సంబంధాలేంటి? బంగారం వాకడంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో, వెలికితీతలో అధమ స్థానంలో ఎందుకున్నాం? 

రెండు టన్నులు మాత్రమే 

భారతీయులు ఆభరణ ప్రియులు. మన ఆలయాల్లో 26వేల టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. కానీ బంగారం ఉత్పత్తిలో మన దేశం తీసికట్టుగా ఉంది. 2016 నాటి లెక్కల ప్రకారం చైనా అత్యధికంగా 440 టన్నుల ఉత్పత్తితో అగ్రస్థానంలో, ఆస్ట్రేలియా 300 టన్నులతో రెండో స్థానంలో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, కెనడా తదితర దేశాలు కూడా ముందు వరసలో ఉన్నాయి. వీటితో పోల్చుకుంటే భారత్ సొంతంగా 2 నుంచి 3 టన్నులను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. 

కర్ణాటక టాప్ 

Related image

మనదేశంలో బంగారం గనులు తక్కువ. భూగర్భంలో భారీగా ఉన్నట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నా, దాన్ని వెలికితీయడం అంత సులభం కాదు. భూగర్భ శిలలను తొలచుకుని వెళ్లడం కష్టమైన పని. అసలు పసిడి తవ్వకమే చాలా ఖరీదైన వ్యవహారం. టన్ను మట్టిని జల్లెడ పడితే గ్రాము బంగారం రావడం గొప్ప. ఇంతటి క్లిష్టమైన వ్యవహారంలోకి ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు దిగడానికి సిద్ధంగా లేవు. ఒకవేళ పైవేటు కంపెనీలు ముందుకొచ్చినా లీజు, పన్నులతో తలనొప్పి ఎదురవుతుంది. అందుకే పెట్టుబడులు ఫార్మా, కమ్యూనికేషన్లు వంటి ఇతర రంగాల్లోకి మళ్లుతున్నాయి. ఇక ప్రస్తుత గనుల విషయానికి వస్తే వాటిలోని నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. బంగారం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక.. కోలారు(కేజీఎఫ్) గనిని ఎప్పుడో మూసేసింది. 120 ఏళ్లలో ఈ గని నుంచి 800 టన్నుల బంగారం వెలికి తీశారు. కర్ణాటకలోని మరో ప్రఖ్యాత హట్టి గనితోపాటు, ధర్వాడ్, హసన్, రాయచూర్ జిల్లాల్లోనూ స్వర్ణాన్ని లాగుతున్నారు. దేశంలో దొరికే బంగారంలో 88 శాతం ఒక్క కర్ణాటక నుంచే వస్తోంది. 2002-2003లో ఈ రాష్ట్రంలో 2,700 కేజీల బంగారాన్ని వెలికి తీశారు. ఏపీలోని రామగిరి గోల్డ్ ఫీల్డ్(అనంతపురం), బిసనట్టం, పాలచ్చూర్(చిత్తూరు), జొన్నగిరి(కర్నూలు)లోనూ  బంగారం దొరుకుతోంది. ఆంధ్రప్రదేశ్ బంగారం ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉంది. అయితే ఈ గనుల్లోనూ నిల్వలు అడుగంటిపోతున్నాయి. 

డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ.. 

Image result for gold in karnaTAKA

మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఏటా 900 టన్నులను కొంటుండంగా, అందులో 750 టన్నులను విదేశాల నుంచే తెచ్చుకుంటున్నాం. దీంతో భారీస్థాయిలో భారతీయుల ధనం ఇతర దేశాలకు తరలిపోతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం బంగారంపై సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. అయినా కొనుగోళ్లు, డిమాండ్ తగ్గడం లేదు. 

ఉత్పత్తి వ్యయం భారీగా.. 

చైనా, ఆస్ట్రేలియా భూస్వరూపాలు మన దేశంలాగానే ఉంటాయి. కానీ అక్కడి పరిశ్రమలు ఆధునిక టెక్నాలజీ వాడి పసిడి మేటలను పక్కాగా గుర్తించి వెలికితీస్తున్నాయి. భూభాగం కూడా పెద్దగా ఉండడంతో చైనా బంగారు పిట్టలా మారిపోయింది. చైనా, ఆస్ట్రేలియాల్లో ఎక్కువగా గనుల ఉపరితలంలో బంగారాన్ని వెలికితీస్తున్నారు. అయితే మన దేశంలోని గనుల్లో పసిడి కోసం రెండు, మూడు కి.మీ. లోతులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో గిట్టుబాటు కాక కంపెనీలు సాహసం చెయ్యడంలేదు. దీనికి తోడు పర్యావరణ పరిక్షణ, స్థానిక ప్రజల భూహక్కులు, గనులను త్వవ్వి వదిలేశాక వాటిని పూడ్చి యథాతథ స్థితికి తీసుకొచ్చే ఖర్చులు తదితర అంశాలు కూడా తవ్వకాలను ప్రభావితం చేస్తున్నాయి. అంతకు ముంచి గని నిర్వహణకు కోట్లాది రూపాయలు అవసరం. కిలోమీటర్ల కొద్దీ భూమి కావాలి. యంత్రాంగం, శ్రామికులు, నిపుణులు, భద్రతకు భారీగా వ్యయం చేయాలి. ఉపరితల గనుల్లో(ఓపెన్ కాస్ట్) ఒక టన్ను మట్టిని వెలికి వెలికితీసి శుద్ధిచేస్తే 1.5 గ్రాముల బంగారం రావాలి. అదే భూగర్భ గనుల్లో అయితే టన్ను మట్టికి 8-9 గ్రాముల బంగారం రావాలి. దీనికి ఏమాత్రం తక్కువొచ్చినా పెట్టిబడి మట్టిపాలే అవుతుంది. దీంతో చాలా కంపెనీలు ఈ తతంగానికి దూరంగా ఉంటున్నాయి. ఫలితంగా మనదేశంలో బంగారం కోసం విదేశాలపైనే ఆధారపడుతోంది!