అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా అక్రమ బంగారం రవాణా కొనసాగుతోంది. నిఘా అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని తరలించేందుకు నిందితులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా మరోసారి శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. గురువారం సూడాన్ జాతీయుల నుంచి సుమారు రూ.7.90 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 23 మంది సూడాన్ మహిళా ప్రయాణికులు గ్రూప్‌గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. బంగారాన్ని వివిధ చోట్ల దాచి తరలించే ప్రయత్నం చేశారు. అధికారులకు అనుమానం వచ్చి తనికీ చేయడంతో వారి బండారం బయటపడింది. నిందితులు షూకింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని బంగారం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించి 4.906 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి..మిగిలిన వారిని విచారిస్తున్నారు.