Gold, silver, jewellery put under controlled delivery list
mictv telugu

కేంద్రం కీలక నిర్ణయం.. బంగారం, వెండి ఆ జాబితాలోకి..

July 13, 2022

బంగారం, వెండి, విలువైన లోహాలు మరియు పురాతన వస్తువులు వంటి వాటిని కంట్రోల్డ్ డెలివరీ జాబితాలోకి చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే ఇకపై సంబంధిత అధికారుల అనుమతి లేనిదే ఈ జాబితాలోని విలువైన వస్తువులను దేశంలోనికి దిగుమతి కానీ, విదేశాలకు ఎగుమతి చేయడం కుదరదు. అంతేకాదు.. అనుమానిత సరుకుల విషయంలో సంబంధిత అధికారికి ట్రాకింగ్ పరికరాన్ని కూడా ఉంచే అధికారం ఉంటుంది.

అనుమానిత సరుకు భారతదేశానికి దిగుమతి అవుతోందని లేదా దేశం నుంచి ఎగుమతి చేవుతోందని అధికారి విశ్వసిస్తే.. అటువంటి సరుకుకు నియంత్రిత డెలివరీని చేపట్టాలని ప్రతిపాదించొచ్చు. దీని కోసం సంబంధిత అధికారి ఫారమ్-1 రూపంలో నివేదికను దాఖలు చేయాల్సి ఉంటుంది. నియంత్రిత డెలివరీని చేపట్టడానికి దాఖలు చేసిన నివేదికను, అనుమతులు కోరుతూ పైస్థాయిలోని సంబంధిత అధికారులకు పంపాలి. వీళ్లు పరిశీలన తర్వాత అనుమానిత సరుకు నియంత్రిత డెలివరీకి ఆమోదం తెలియజేయవచ్చు. ఆమోదం లభించిన తర్వాత అనుమానిత సరుకుకు ట్రాకింగ్ డివైస్‌ వంటివి అమర్చవచ్చు.

ఒకవేళ నియంత్రిత డెలివరీకి ముందుగానే ఆమోదం పొందలేని పక్షంలో, సంబంధిత అధికారి ఆ తర్వాత అయినా వెంటనే ఆమోదం పొందవచ్చు. కానీ నిర్ణీత నియంత్రిత డెలివరీ ముగిసిన తర్వాత 72 గంటలలోగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కంట్రోల్డ్ డెలివరీ జాబితాలో ఇప్పటి వరకు నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలు, పలు రసాయనాలు, నియంత్రిత పదార్థాలు లేదా వాటి ప్రత్యామ్నాయాలు, మద్యం ఇతర మత్తు పానీయాలు, నకిలీ కరెన్సీ, సిగరెట్లు, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, వన్యప్రాణుల ఉత్పత్తులు వంటివి కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకారం.. ఈ లిస్ట్‌లో ఉన్న వాటి ఎగుమతులు లేదా దిగుమతులకు సంబంధిత అధికారులు ఆమోదం కచ్చితంగా ఉండాల్సిందే