వీడి తెలివి కరోనా ఎత్తుకుపోను.. బంగారం అక్కడ దాచాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

వీడి తెలివి కరోనా ఎత్తుకుపోను.. బంగారం అక్కడ దాచాడు.. 

September 30, 2020

Gold smuggling in face mask Kozhikode airport .

కర్ణుడి చావుకు వంద కారణాలైతే, బంగారం స్మగుల్ చేయడానికి లక్ష దారులు! దోసె పెనం, కుక్కర్, ఊరగాయ, చెడ్డీ, చెంబు.. ఎందులోనైనా సరే కాసింత బంగారాన్ని కూరి దర్జాగా విమానాలు ఎక్కడం, దొరికితే దొంగ లేకపోతే దొరగా తప్పించుకోవడం రోజూ చూస్తున్నాం. ఓ దొంగబాబు కాలానికి తగ్గట్టు క్రియేటివిటీ జోడించి అడ్డంగా బుక్కయ్యాడు. 

కరోనా వైరస్ సోకుండా పెట్టుకునే ఫేస్ మాస్క్‌నే అక్రమ బంగారాన్ని అడ్డగా మార్చేశాడు. కరోనా టైంలో ఫేస్ మాస్క్‌ను పట్టుకుని లాగి ఎవరు తనిఖీ చేస్తార్లే అనుకున్నాడు. కానీ టైం బాగోలేక బండారం బయటపడింది. కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వచ్చిన ప్రయాణికుడు ఎన్-95  రకం ఫేస్ మాస్క్ లోపల రూ. 2 లక్షల విలువైన 40 గ్రాముల బంగారాన్ని దాచుకుని వచ్చాడు. మాటిమాటికీ మాస్క్ సర్దుకోవడంతోపాటు, మెటల్ డికెటక్టర్ కూడా తన పని తాను చేసుకుపోవడంతో విషయం తెలిసిపోయింది. రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అతణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.