హైదరాబాద్‌లో వరద బీభత్సం సృష్టిస్తోంది. రోడ్లపై కాలు తీసి వేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ వరద నీటిలో ఓ వ్యక్తి ఏకంగా కేజీన్నర బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నారు. తీసుకెళ్తుండగా అవి వరదనీటిలో కొట్టుకుపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో సోమవారం ఇది జరిగింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ జూవెల్లరీ షాపు నుంచి మరో దుకాణానికి వీటిని తరలిస్తుండగా ఇది జరిగింది.
బషీర్‌బాగ్‌లోని పీఎస్ గోల్డ్‌షాపు నిర్వాహకుడు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని మరో షాపులోకి బంగారు ఆభరణాలను తన వద్ద పని చేసే ఉద్యోగి ప్రదీప్‌కు ఇచ్చి పంపించాడు. వాటిని బ్యాగులో పెట్టుకుని స్కూటీ పై బయలుదేరాడు. బ్యాగును కాళ్ల మధ్య పెట్టుకుని వెళ్తుండగా వరద నీరు ఉండటంతో దాంట్లోంచి బైక్ పోనిచ్చాడు. ఈక్రమంలో.. నగల బ్యాగు జారి వరద నీటిలో పడిపోయింది. వెంటనే దానికి కోసం వెతకగా అది చాలా సేపు కనిపించలేదు. విషయాన్ని షాపు యజమానికి తెలియజేడయంతో అందరూ కలిసి వచ్చి వెతికారు. అయితే ఓ ప్రాంతంలో బ్యాగును గుర్తించారు. కానీ అందులో ఉన్న నగలు మాత్రం కనిపించలేదు. నీటిలో గాలించినా లేకపోవడంతో పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్ లభించిన ప్రాంతంలో సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.